T20 World cup Records Most catches in an innings: ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌(ICC T20 world cup)  రికార్డులన్నీ చిత్రంగానే ఉంటాయి. 20 ఓవర్ల ఫార్మాట్‌లో సాధారణంగా బ్యాట్స్‌మెన్‌ హవానే నడుస్తుంది. వీలైనంత ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా, వచ్చినప్పటి నుంచి బ్యాటర్లు దంచుతూనే ఉంటారు. వారిని అడ్డుకునేందుకు బౌలర్లు వ్యూహాత్మంగా బంతులేస్తూ ఉంటారు. అందుకు బౌలర్లకు పూర్తిగా సహకారం అందించాల్సింది ఫీల్డర్లే. బంతిని బౌండరీకి పోకుండా ఆపడం దగ్గరి నుంచి సింగిల్ తీయకుండా కూడా భయపెట్టగలిగేలా ఫీల్డింగ్ ఉంటే విజయం ఆ జట్టునే వరిస్తుంది. ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు మరింత కీలకం. ఒక్కోసారి ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్‌ వదిలేశాడంటే ఆ మ్యాచ్‌ ఫలితమే మారిపోయిన సందర్భాలు కోకొల్లలు.


అత్యధిక క్యాచ్‌ లు పట్టిన ఆటగాళ్ళు 


టీ20 ప్రపంచకప్‌ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు(Most catches in an innings)లు కూడా ఆసక్తికరమే. అంత పొట్టి ఫార్మాట్‌లో ఒక ఫీల్డర్‌ ఎన్ని కేచ్‌లు పట్టగలడు అనుకుంటే పొరపాటే. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి(DJG Sammy) పేరిట ఉంది. 2010 ఏప్రిల్ 30న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామి ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టాడు. ఆ రికార్డు ఇంకా బద్దలుకాలేదు.


ఆ తర్వాత స్థానంలో ఆసీస్ పేస్ బౌలర్‌ బ్రెట్‌ లీ(Brett Lee) ఉన్నాడు. 2007 సెప్టెంబరు 20న కేప్‌టౌన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్రెట్‌లీ ఒకే ఇన్నింగ్స్‌లో 3 క్యాచ్‌లు పట్టాడు. విండీస్‌కు చెందిన సులేమాన్ జమాల్ బెన్‌ 2009 జూన్ 6న ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు అందుకున్నాడు. అదే ఏడాది జూన్‌ 12న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు సిమన్స్‌ 3 క్యాచ్‌లు ఒడిసి పట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. 2009 జూన్ 16న భారత్‌తో నాటింగ్‌ హామ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 3 క్యాచ్‌లు అందుకుని రికార్డు నెలకొల్పాడు.


మనోళ్ళు తక్కువేం కాదు.. 


పొట్టి ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 3 క్యాచ్‌ల రికార్డును మన ఆటగాళ్లు కూడా సాధించారు. వారిలో మొదట చెప్పుకోవాల్సింది సురైష్ రైనా. రైనా ఈ ఘతనతను రెండు సార్లు సాధించాడు. 2012 అక్టోబరు 2న దక్షిణాఫ్రికాతో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో రైనా 3 క్యాచ్‌లు అందుకున్నాడు. 2014 మార్చి 21న మిర్పూర్‌లో పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా 3 క్యాచ్‌లను రైనా పట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021 నవంబరు 8న దుబాయ్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) 3 క్యాచ్‌లు పట్టి రికార్డు సాధించాడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండడనే అపవాదు ఉన్న హిట్ మ్యాన్ 3 క్యాచ్‌ల రికార్డు సాధించడం విశేషం.