Jagan Mohan Reddy: 2019 మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేసిన నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తి అయ్యాయి. 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి దేశమంతా ఆంధ్రప్రదేశ్‌వైపు చూసేలా చేశారు. 50 శాతానికిపైగా ఓటు శాతంతో 151 ఎమ్మల్యే సీట్లు, 22 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గిరగిరా తిరిగింది. జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం 23 అసెంబ్లీ సీట్లు, కేవలం మూడంటే మూడే లోక్‌సభ స్థానాలతో ప్రాణాలు నిలుపుకోగా... ఒక్కస్థానంతో సరిపెట్టుకుంది. రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదు. 


ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన ప్రచారం, నవ రత్నాలు పేరుతో తీసుకొచ్చిన మేనిఫెస్టో ప్రజలను బాగా ఆకర్షించింది. అప్పటి వరకు ఆఖరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పింఛన్లు పెంచినా, నిరుద్యోగ భృతి ఇచ్చినా, పసుపుకుంకమ పేరుతో మహిళలకు వరాలు ప్రకటించినప్పటికీ వైసీపీ విన్నింగ్ స్పీడ్‌ను ఆపలేకపోయింది. 23 ఎమ్మల్యే, 3 ఎంపీ స్థానాలతో టీడీపీ బిక్కచచ్చిపోతే... లోకేష్‌ పరాజయం, పవన్ కల్యాణ్ రెండు  చోట్ల ఓడిపోవడం ఆ పార్టీలను మరింత కుంగదీసింది. ఈ ఫ్యాన్ హోరుగాలిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. 



ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి 2019 మే 30 విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌  ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు నుంచి  స్టాలిన్ ఇలా చాలా మంది హేమాహేమీలు వచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన జగన్.. కీలకమైన నిర్ణయాలతో సంచలనం రేపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పుకొచ్చి అది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. 


2024 ఎన్నికల్లో ఆ మేనిఫెస్టోనే ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. అందులోని 99 శాతం హామీలు అమలు చేశామని 95 శాతం హామీలు మొదటి ఏడాదిలోనే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ప్రతి ఎన్నికల ప్రచార సభల్లో కూడా 2019 నాటి వైసీపీ మేనిఫెస్టో, 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోను చూపించి విమర్శలు చేశారు. రెండింటికీ తేడాను గమనించిన 2024 ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఐదేళ్లలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు 


మూడు రాజధానులతో సంచలనం 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, ఎగ్జక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటుందని సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పటి వరకు అమరావతే రాజధానిగా ఉంటుందని భావించిన వారందరికీ షాక్ ఇచ్చారు.  దీనిపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగాయి. న్యాయస్థానాల్లో వాదనలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా దీన్ని ప్రధానంగా పార్టీలు ప్రచారం చేశాయి. గెలిచిన వెంటనే విశాఖ కేంద్రంగా తాను ప్రమాణం చేస్తానంటూ జగన్ ప్రకటిస్తే... అమరావతిలోనే ప్రమాణం చేస్తామంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. 


జిల్లాల వికేంద్రీకరణ 
జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో జిల్లా వికేంద్రీకరణ ఒకటి. 13 జిల్లాలుగా ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా మార్చారు. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలను బేస్ చేసుకొని 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. మన్యం ప్రజల కోసం ప్రత్యేకంగా అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం అనే రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. 


సచివాలయ వ్యవస్థ 
జగన్‌ పాలనలో దేశంలోని ఇతర రాష్ట్రాలను ఆకర్షించిన మరో అంశం సచివాలయాల ఏర్పాటు. పాలనను మరింతగా ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిందీ ఈ వ్యవస్థ. ప్రజలకు అవసరమైన అన్ని వ్యవస్థలకు సంబంధించిన సిబ్బంది ఈ సచివాలయంలో ఉంటారు. అంటే రాష్ట్రంలో సచివాలయానికి ఉండే ప్రాధాన్యత గ్రామ వార్డు సచివాలయాలకు ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. ప్రజలు ఎవరూ మండలాలు, జిల్లా అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా వారి నివాశి ప్రాంతంలోనే పనులు చక్కబెట్టే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది ప్రభుత్వం. 


వలంటీర్ వ్యవస్థ 
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలో ఉండేందుకు ఈ వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఐదు వేల గౌరవేతనం ఇస్తూ నియమించింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు క్రమంగా అందేలా చూడటమే వీరి ప్రధాన విధి. ఎన్నికల సమయంలో ఈ వ్యవస్థపై ఈసీ ఆంక్షలు విధించడంతో పెను దుమారమే రేగింది. ఏకంగా ప్రచారంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషించింది. 


నాడు నేడు విప్లవం 
వైద్య, విద్య వ్యవస్థను బాగు చేసేందుకు నాడు నేడు పేరుతో జగన్ సర్కారు ఓ విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. శిథిలావస్థలో ఉన్న బడులు, వైద్యాలయాల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నించింది. ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎంపిక చేసిన బడులు, వైద్యాలయాల పునర్‌నిర్మాణం చేప్టటింది. ఆధునిక హంగులతో పూర్తి సాంకేతికతతో ఆదర్శంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. 


డీబీటీ బటన్ 
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు బటన్‌ నొక్కడాన్ని కూడా ప్రాధాన్య అంశంగా తీసుకుంది జగన్ సర్కారు. ఏడాదిలో ఏ నెల ఏ పథకానికి డబ్బులు విడుదల చేయబోతున్నారో ముందుగానే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారు. ఇలా ప్రతి నెలకో పదిహోను రోజులకో ఒకసారి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇలా ఈ డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. 


ఇళ్ల స్థలాల పంపిణీ 
జగన్ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం మహిళకు ఇళ్ల స్థలాల పంపిణీ. ఇళ్ల పథకంలో భాగంగా జగన్ సర్కారు భారీగా భూములు కొనుగోలు చేసింది. ఊరి సమీపంలో ఈ స్థలాలు కొనుగోలు చేసి అందులో లబ్ధిదారులకు ఇల్లు కట్టించి ఇచ్చింది. చాలా మంది ఇల్లు కట్టుకోగా మరికొన్ని నిర్మాణ దశలోఉన్నాయి. 


విప్లవాత్మక నిర్ణయాలెన్నో వివాదాలన్ని


ఈ ఐదేళ్లలో ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలతోపాటు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా జగన్ సర్కారు తీసుకుంది. విద్యుత్, బస్ చార్జీలు పెంపు, చెత్తపై వేసిన పన్ను, ప్రభుత్వ బిల్డింగ్‌లకు వైసీపీ రంగులు వేయడం, దిశ పేరుతో తీసుకొచ్చిన చట్టం అమలు కాకపోవడం, పాస్‌బుక్‌లపై జగన్ ఫొటో, ఇలాంటి నిర్ణయాలు చాలా వరకు విమర్శలపాలు అయ్యాయి.