ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా  పలు రకాల చర్చలకు కారణం అవుతోంది. ప్రభుత్వం ఏదీ స్పష్టంగా చెప్పి చేయకపోవడం..  తీసుకునే ప్రతి నిర్ణయం కింద నిగూఢమైన మరో వ్యూహం ఉంటూండటంతో  అమరావతి విషయంలో  ప్రభుత్వ నిర్ణయాలపై అనేక రకాల కోణాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యూహంపై చర్చ ప్రారంభమయింది.  ప్రభుత్వం మనసు మార్చుకుని అభివృద్ధి చేయడానికే ఈ నిర్ణయమని కొంత మంది అంటున్నారు. కానీ రాజకీయం కోసం మళ్లీ వ్యూహాలు ప్రారంభించారని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. అసలు అంశం కోర్టులో ఉంటే ఎలా ప్రజాభిప్రాయసేకరణ చేస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.  వీటిలో ప్రభుత్వం అసలు ఏ ఉద్దేశంతో అమరావతిని కార్పొరేషన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుంది...?


Also Read: రాజధాని గ్రామాలన్నీ కలిపి మున్సిపల్ కార్పొరేషన్... ప్రజాభిప్రాయసేకరణకు ఏపీ సర్కార్ రెడీ !


ఇప్పటికే మంగళగిరి - తాడేపల్లిలను కలుపుతూ ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు!  


గత ఏడాది మార్చిలోనే  మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్టీల తోపాటు మరో 21 గ్రామాలను కలిపి కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 21 గ్రామాల్లో రాజధాని అమరావతి పరిధిలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. నిజానికి తాడేపల్లి, మంగళగిరిలను ఫస్ట్ గ్రేడ్ మున్సిపాల్టీలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిన తర్వాత ఒక్క సారి కూడా ఎన్నికలు జరగకుండానే  మళ్లీ వాటిని కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మున్సిపాల్టీకి అప్పటి వరకు ఎన్నికలు జరగలేదు.    ఐదు లక్షల జనాభా దాటి న తర్వాత మునిసిపల్‌ ప్రాంతాన్ని కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల జనాభా దాటితే దానిని మహా నగర పాలకసంస్థగా అప్‌గ్రేడ్‌ చేస్తా రు. మంగళగిరి, తాడేపల్లిలో ప్రస్తు తం రెండు, మూడు లక్షలకు మించి జనాభా లేరు. అయినా కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు.


Also Read: అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా ?


ఇప్పుడు కొత్తగా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు !


ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఈ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, ఉద్ధండరాయినిపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం, ఐనవోలు, శాఖమూరు, నేలపాడు, దొండపాడు, రాయపూడి, తుళ్లూరు, మంగళగిరి మండలంలోని కురుగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం ఈ కార్పోరేషన్ పరిధిలోకి వస్తాయి.  మంగళగిరి - తాడేపల్లిలను కలుపుతూ ఏర్పాటు చేసిన కార్పొరేష్‌లో ఉన్న అమరావతి రాజధాని గ్రామాలను ఇందులో కలపలేదు., అంటే .. రెండు వేర్వేరు కార్పొరేషన్లు ఉంటాయన్నమాట.


Also Read: అమరావతి మూడు రాజధానుల్లో ఒకటి... చంద్రబాబు బినామీలతో యాత్రలు చేయిస్తున్నారు... తిరుపతి సభపై వైసీపీ నేతల విమర్శలు


మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనేనంటున్న అమరావతి రైతులు !


సీఆర్డీఏ చట్టంలో 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతంగా పేర్కొన్నారు.   మంగళగిరి మండలంలోని నవులూరు, బేతపూడి, నిడమర్రు, ఎర్రబాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాలు తాజా నోటిఫికేషన్​లో చూపలేదు. వీటిని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉంచారు.   ప్రభుత్వం సీఆర్డీఏ చట్టానికి భిన్నంగా, అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విఘాతం కలిగించేలా నోటిఫికేషన్ జారీ చేసిందని రాజధాని జేఏసీ  నేతలు తప్పుపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చవద్దని హైకోర్టు పదే పదే చెబుతున్నా ఎందుకు కోర్టు ధిక్కరణకు  పాల్పడుతున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ అంశం కీలక మలుపులుతిరిగే అవకాశం కనిపిస్తోంది.


Also Read: మూడు ముక్కలాట ఆపి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలి.. తిరుపతి సభలో మార్మోగిన డిమాండ్ !


అభివృద్ధి కోసం కాదు.. రాజకీయమే !?


అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే వివాదాల జోలికి వెళ్లకుండా  మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేసేవారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల గుంటూరు, విజయవాడతో పాటు మరో రెండు  కార్పొరేషన్లు.. అంటే మొత్తం నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు అక్కడిక్కకడే ఉన్నట్లవుతుందని అంటున్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోకి కొన్ని గ్రామాలను తీసుకెళ్లటాన్ని వ్యతిరేకిస్తున్నారు. గ్రామసభల నిర్వహణ  ఎలా జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. 


Also Read: అమరావతి మూడు రాజధానుల్లో ఒకటి... చంద్రబాబు బినామీలతో యాత్రలు చేయిస్తున్నారు... తిరుపతి సభపై వైసీపీ నేతల విమర్శలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి