ఆ కుర్రాడి ఊపిరిలో సాహసం.. కళ్ల ముందు ఎవరెస్టు శిఖరం అంచు.. పిక్కలలో ఉక్కు సంకల్పం.. త్రివర్ణ పతాకాన్ని ఎత్తులో ఎగరవేయాలని దేహమంతా దేశభక్తి.. ఎముకలు కొరికే చలి.. ఊపిరందని పరిస్థితి.. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించగల ఆ కుర్రాడు.. ఒకే ఒక్క పరిస్థితి ముందు మాత్రం తలవంచక తప్పలేదు.. అదే పేదరికం.. ఆశయం కోసం వంద అడుగులు ముందుకు వేస్తుంటే,  ఆర్థిక స్థోమత సహకరించక వేయి అడుగులు వెనక్కి పడుతున్న పురుషోత్తం అనే కుర్రాడిపై ప్రత్యేక కథనం.


పురుషోత్తంది దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబం. తండ్రి ఓ స్కూలు బస్సు క్లీనర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అన్న మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి ఇంటిల్లిపాదికి వండి పెట్టే గృహిణి. ఈ యువకునిది అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం. ఓ పక్క పేదరికం తాండవిస్తూ ఉంటే పురుషోత్తం మాత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేయాలన్న గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు.


ఎవరెస్ట్ అధిరోహణ అంటే మాటలా అక్షరాల రూ.30 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది. ఇప్పటికే దక్షిణ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంతో కిలిమంజారో అధిరోహణ సాధ్యమైంది అంటాడు పురుషోత్తం. అలాగే యూరప్ దేశంలోని ఎల్ బ్రోస్ పర్వత శిఖరాన్ని అధిరోహించి భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు. ఎంతో కఠినమైన పరిస్థితులను తట్టుకుని పర్వతాలయితే ఎక్క కలిగాడు గాని పేదరికాన్ని దాటలేక పోతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనేది ఈ యువకుడి లక్ష్యం. ప్రభుత్వం, దాతలు ఆర్థిక సాయం అందిస్తే అద్భుతాలు సృష్టి స్తానంటున్నాడు పురుషోత్తం.


ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహకరిస్తున్న మనసున్న మానవతామూర్తులు ఉన్న  దేశం మనది. ప్రాణాలకు తెగించి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, అక్కడ జాతీయ పతాకాన్ని ప్రదర్శించే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు పురుషోత్తం. ఆర్థిక సహాయం అందించేందుకు మంచి మనసున్న మా రాజుల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు ఈ యువకుడు.


Also Read: YSRCP Politics: నంద్యాల వైసీపీలో ఏం జరుగుతోంది.. అధికార పార్టీని వీడేందుకు సిద్ధమవుతోన్న నేతలు


Also Read: Dharmana Krishna Das: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి