Gudivada News : ఒకరు అధికార పార్టీ, మరొకరు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసినా స్టేట్ మొత్తం మాట్లాడుకుంటుంది. ఇద్దరూ వారి సామాజిక వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు.  రాష్ట్ర మంత్రి కొడాలి నాని(Kodali Nani), టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా(Vangaveeti Radha) కలిశారు. వైసీపీ(Ysrcp) నేత, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బాబ్జీ అంతిమ యాత్రలో శనివారం పాల్గొన్న ఇరువురు గుడివాడ(Gudivada)లో కలిశారు. అంతిమ యాత్ర సమయంలో ఓ ఆటోలో కాసేపు కూర్చొని సేదతీరారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో వంగవీటి రాధా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  


వైసీపీలో ఆహ్వానం 


గతంలోనూ కొడాలి నాని, వంగవీటి రాధా పలు మార్లు భేటీ అయ్యారు. వంగవీటి రాధాను వైసీపీలోకి రావాలని మంత్రి కొడాలి నాని గతంలో ఆహ్వానించారు. కానీ వంగవీటి రాధా మంత్రి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వంగవీటి రాధా తన హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా పలు పార్టీల నేతలు రాధాను పరామర్శించారు. తాను పార్టీ మారడం లేదని రాధా అప్పుడు ఆ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. అయినా మరోసారి మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా భేటీ అవ్వడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.  


కాపు నేతలతో రాధా భేటీ


కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధా తన హత్యకు రెక్కీ నిర్వహించారని మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ సమక్షంలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పోలీసు విచారణ, ప్రభుత్వం గన్ మెన్ల ఏర్పాటుతో వివాదం సద్దుమణిగింది. కొడాలి నాని, వంశీ, రాధా అప్పుడప్పుడూ సమావేశం అవుతున్నారు. గతంలోనూ రాధా పలుమార్లు గుడివాడకు వెళ్లి అక్కడ మంత్రి కొడాలి నానితో సమావేశం అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వంగవీటి రాధా గుడివాడలో కాపు నేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణకు రాధా హాజరవుతున్నారు. అయితే గుడివాడలో రాధా పర్యటన సమయంలో ఎక్కువగా వైసీపీకి చెందిన కాపు నేతలు ఉండడంతో జోరుగా ప్రచారం జరుగుతుంది. 


Also Read : Gannavaram YSRCP: వల్లభనేనికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డికి లేఖ! YSRCPలో లుకలుకలు - ఇందులో నిజమెంత?