Differences in YSRCP: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తార స్దాయికి చేరుకున్నాయి. వర్గపోరు ముదరటంతో సోషల్ మీడియా సాక్షిగా వర్గపోరు రచ్చ చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) వ్యతిరేకంగా ఒక లేఖ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయసాయి రెడ్డికి (Vijayasai Reddy) దుట్టా వర్గం ఫిర్యాదు చేశారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కలుపుకుపోతానని వైసీపీలోకి వచ్చి కార్యకర్తలను వంశీ వేధిస్తున్నారని, ఫిర్యాదు చేశారు. కొందరు మంత్రుల సాయంతో వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నట్లు వంశీ పై ఆరోపణలు చేశారు. అంతే కాదు వంశీని గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్‌గా తప్పించాలని విజయసాయి రెడ్డికి దుట్టా వర్గం విన్నవించింది. వంశీ తప్ప గన్నవరం ఇన్ ఛార్జ్ గా ఎవరిని పెట్టినా గెలిపిస్తామని అంటున్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దంటూ.. జగనన్న అభిమానులు, వైసీపీ కార్యకర్తల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తొమ్మిదేళ్ల పాటు రూ.కోట్లు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం వైసీపీకి మద్దతు ఇచ్చారని కూడా ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు చాలా ఉన్నాయి. వంశీని టార్గెట్ చేస్తూ ఈ లేఖ రాయటం వెనుక గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ పార్టీ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో సీఎంకు జగన్‌కు మరింత దగ్గర కావటంతో పాటుగా పార్టీ కార్యకలాపాలు కూడా వంశీ వేగవంతం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. కాబట్టి, వంశీని ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే సీఎం నియోజకవర్గాల శాసన సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపద్యంలో వంశీకి పార్టీ పరంగా సహయ నిరాకరణ చేయాలని కూడా భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్దితుల్లో గన్నవరం రాజకీయంలో ఎలాంటి మలుపులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.