పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తణుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓ అవినీతి కాలనాగు అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇటీవల ఆరోపించారు. కారుమూరి అవినీతిదెబ్బకు పేదలు బలవుతున్నారని, వందల కోట్ల అవినీతి చేశారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ సీతారామ్ గతంలోనే లేఖ రాశారని పట్టాభి వ్యాఖ్యానించారు. తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ (TDP Leader Arimilli Radha Krishna) హయాంలోనే రూ.1000 కోట్ల టీడీఆర్ స్కాం (ట్రాన్స్ ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్ కింద ఇచ్చే పత్రాలు) జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు (YSRCP MLA Karumuri Nageswara Rao) తాజాగా ఆరోపించారు.


తణుకు మున్సిపాల్టీలో 39 మందికి పైగా టీడీపీ సానుభూతి పరులు టీడీఆర్ బాండ్లు పొందినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి పేర్కొన్నారు. వారు కూడా తన బినామీలేనా అని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణను ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ నేత కారుమూరి ప్రశ్నించారు. ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు జారీ చేసే సర్టిఫికెట్లతో తనకు సంబంధాన్ని ముడిపెట్టటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ హయాం నుంచే టీడీఆర్ బాండ్లు జారీ మొదలైందని.. అందులో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయని కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. 


విచారణకు సిద్ధమే..
వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. తణుకులో తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాథాకృష్ణ అరాచకాలను ఉక్కుపాదంతో అణిచి వేస్తామని వ్యాఖ్యానించారు. తాను చాలా క్రమశిక్షణతో ఎదిగానని జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పని చేశానని.. కానీ పార్టీ నేతలు కొన్ని సందర్భాల్లో తనపై కుట్రలు చేస్తున్నారని గతంలోనే మండిపడ్డారు.


అవినీతి కాలనాగు కారుమూరి: టీడీపీ నేత పట్టాభి
వైఎస్సార్‌సీపీ అవినీతి పుట్టలో నుంచి అవినీతి కాలనాగు తణుకు ఎమ్మెల్యే కారుమూరి అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇటీవల ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని కొల్లగొట్టడంలో కింది వారు తనను చూసి నేర్చుకోవాలని సీఎం వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దోపిడీకి లైసెన్స్ ఇచ్చేశారని వ్యాఖ్యలు చేయడం అప్పట్లో నేతల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలకు కారణమైంది. 2020-21 ఏడాదిలో తణుకు పట్టణానికి సమీపంలో వీరభద్రాపురం-కొమరవరంరోడ్డులో గ్రీన్ ఫీల్డ్ జోన్‌లో ఉన్న వ్యవసాయ భూములను తన బినామీలతో కారుమూరి కొనుగోలు చేయించారని ఆరోపణలున్నాయి.