కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జిల్లాలో పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన ఓటమి కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. శనివారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తారట కదా? అని ప్రశ్నించగా.. ఎమ్మెల్యే ఈ మేరకు స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌ కాకినాడ నగరంలోనే కాదు, తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకుని పవన్‌ కల్యాన్‌ను ఓడిస్తా.’’ అని వ్యాఖ్యానించారు.


మరోవైపు జనసేన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నారని, త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందని అన్నారు. ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి పార్టీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నానని ద్వారంపూడి చెప్పారు.


మంత్రి పదవిపై ఆశ లేదు
త్వరలో ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా, మంత్రి పదవిపై తనకు ఆశ లేదని అన్నారు. సామాజికవర్గం పరంగా తూర్పు గోదావరి జిల్లాలో రెడ్లు మంత్రి పదవి ఆశించడం అంత తప్పు ఇంకొకటి లేదని అన్నారు. మంత్రి పదవి అడిగి తమ నాయకుడు జగన్‌ను ఇబ్బంది పెట్టబోనని తెలిపారు.


వ్యాఖ్యలపై స్పందించిన నాదెండ్ల మనోహర్‌
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యలపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలా అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై కాకినాడ నగరం నుంచి తమ పార్టీ అభ్యర్థి ముత్తా శశిధర్‌ గెలుస్తారని అన్నారు.