ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. కార్పొరేషన్ల అప్పులు, నిధుల బదిలీలు, అలాగే నిధుల స్వాధీనం వంటివి కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ కోణంలో తాజాగా అభయహస్తం పథకాన్ని ఆపేస్తున్నామని.. దానికి సంబంధించిన కార్పస్ ఫండ్ కూడా ప్రభుత్వానికి ఇచ్చేశామని ఇక ఎలాంటి క్లెయిమ్‌లు చెల్లించబోమని ఎల్‌ఐసీ ఓ పేపర్ ప్రకటన జారీ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. అసలు అభయహస్తం పథకం ఏమిటి ? ఎల్‌ఐసీ ఎందుకు ప్రకటన చేసింది ? ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది ?
డ్వాక్రా మహిళల బీమా ధీమా అభయహస్తం !
డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు 59 ఏళ్ల వరకే ఉండగలరు. తర్వాత వారికి గ్రూపుల్లో అవకాశం ఉండదు. లబ్ది చేకూరదు. ఇలా 60ఏళ్లు చేరిన వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభయహస్తం పథకాన్ని ప్రారంభించారు. 18 - 59 ఏళ్ల వయస్సున్న డ్వాక్రా సభ్యులు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే 60వ సంవత్సరం నుంచి వయస్సును బట్టి నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్ లభిస్తుంది. అలాగే ప్రీమియం చెల్లించే సమయంలో సభ్యురాలు మరణిస్తే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. ఈ పథకానికి ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నారు. సభ్యులు చెల్లించేది.. ప్రభుత్వం చెల్లించేది కార్పస్ ఫండ్ రూపంలో ఎల్‌ఐసీ వద్ద ఉంటంది.
ప్రభుత్వానికి రూ. 2,118 కోట్ల అభయహస్తం నిధులు !
హఠాత్తుగా ఎల్‌ఐసీ ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. అభయహస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకున్ందున ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న, భవిష్యత్తులో రానున్న బీమా క్లెయిమ్‌లతోనూ, ఫించను చెల్లింపులతోనూ తమకు ఎటువంటి సంబంధం లేదని ఎల్‌ఐసి స్పష్టం చేసింది. ఇది డ్వాక్రా మహిళల్లోనూ అలజడి రేపింది. ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఎల్‌ఐసీ అభయహస్తం కార్పస్ ఫండ్‌గా ఉన్న 2,118 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వంానికి బదలాయించింది. గత నెల 20వ తేదినే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ, ఎల్‌ఐసి జారీ చేసిన తాజా బహిరంగ ప్రకటనతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !
డ్వాక్రా మహిళల పెన్షన్ సంగతేంటి !?
డ్వాక్రా సభ్యులు ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తున్నారు. దీంతో ఎల్‌ఐసి వద్ద 2,118 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ పోగుపడింది. వీరిలో 4,21,837 మందికి నెలకు రూ.500 నుంచి రూ.2,200 వరకు పింఛన్ ఇస్తున్నారు. ప్రీమియం చెల్లిస్తూ మృతి చెందిన 36,378 మంది కుటుంబ సభ్యులకు ఎల్‌ఐసి బీమా మొత్తాన్ని కూడా చెల్లింపు చేసింది. ఇప్పుడు వీరికి పెన్షన్ ఎవరిస్తారన్నదానిపై స్పష్టత లేదు. అలాగే ఇంత కాలం ప్రీమియం చెల్లించిన డ్వాక్రా సభ్యులకు పథకం ఆపేసినందున డబ్బులు తిరిగి ఇస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
అధికారికంగా స్పందించని ప్రభుత్వం !
అభయ హస్తం పథకం కింద బీమా సౌకర్యం కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ..సెర్ప్ కొనసాగిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ బీమా పథకం కింద ఏ విధంగా ప్రభుత్వం క్లెయిమ్‌లు చెల్లిస్తుందో అదే రీతిలో సెర్ఫ్ ద్వారా బీమా క్లెయిమ్‌లను పరిష్కరిస్తామంటున్నారు. కానీ అధికారికంగా చెప్పడం లేదు. దీంతో విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. డ్వాక్రా మహిళల సొమ్ములు కూడా తీసుకున్నారని విమర్శించడం ప్రారంభించాయి.
Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి