హైకోర్టులో అమరావతి కేసుల విచారణ డిసెంబర్ 27వ తేదీకి వాయిదా పడింది. ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకున్న విషయాన్ని ప్రత్యేక అఫిడవిట్ల ద్వారా హైకోర్టుకు తెలిపింది. శనివారం రోజు మరో అనుబంధ అఫిజవిట్ దాఖలు చేసింది. అందులో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. దీంతో హైకోర్టులో వాదనలపై ఆసక్తి ఏర్పడింది.  హైకోర్టులో విచారణ ప్రారంభమవగానే పిటిషనర్ల తరపున న్యాయవాదులు శ్యామ్‍దివాన్, సురేష్ వాదనలు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకు వస్తామని చెప్పిందని చెప్పిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 


Also Read : పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని .. మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతోందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని కోరారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రభుత్వం బిల్లులు ఉపసంహరించుకున్నందున ఈ పిటిషన్లపై విచారణ ముగించాలని కోరారు. అయితే బిల్లుల ఉపసంహరణపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనందున.. గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 


Also Read : ఉద్యమబాట పట్టిన ఉద్యోగ సంఘాలు... డిసెంబర్ 1 నుంచి ఉద్యమ కార్యాచరణ


అయితే అభివృద్ధికి ఆటంకాలు ఉన్న కారణంగా చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతి బంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్‍కో ఉత్తర్వులు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా వేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అనారోగ్యంగా ఉండటంతో  హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


Also Read : నెల్లూరులో అమరావతి రైతులకు సర్‌ప్రైజ్.. సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !


పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించడంతో ఇక వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు. అయితే ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం.. మళ్లీ బిల్లులను ప్రవేశ పెడతామని చెప్పడంతో  పరిస్థితి మొదటికి వచ్చిందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. గవర్నర్ బిల్లుల ఉపసంహరణ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగే విచారణలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


Also Read : కండలేరు రిజర్వాయర్‌కు గండీ పడనుందా? అసలు నిజం ఏంటంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి