నెల్లూరు జిల్లాలో ఇటీవల సోమశిల ప్రాజెక్ట్ పై వచ్చిన పుకార్లు తీవ్ర భయాందోళనలు కలిగించాయి. సోమశిల కట్ట తెగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఆ పుకార్లకు కారణమైనవారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కండలేరు ప్రాజెక్ట్ పై పుకార్లు మొదలయ్యాయి. కండలేరు ప్రాజెక్ట్ కి సంబంధించి మట్టికట్టనుంచి మట్టి జారిపోతోందనే వార్తలొచ్చాయి. 


ఏది నిజం..? ఎంత నిజం..?
నెల్లూరు జిల్లా రాపూరు మండలం చెల్లటూరు గ్రామంలో 1983లో కండలేరు డ్యామ్ నిర్మించారు. కండలేరు ప్రాజెక్ట్ మట్టికట్ట 11 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ఇందులో 6 నుంచి 8వ కిలోమీటర్ మధ్యలో కొంతభాగం మట్టి కిందకు జారిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి బాగా వదులు కావడంతో కొంతమేర కిందకు జారింది. ప్రాజెక్ట్ విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ఉంటే ఇది కూడా జరిగేది కాదు. కానీ ఇప్పుడు మట్టి కొంతభాగం కిందకు జారడంతో జనం భయపడుతున్నారు. 


కండలేరు కెపాసిటీ ఎంత..?
కండలేరు ప్రాజెక్ట్ కి నేరుగా నదులతో అనుసంధానం లేదు. తెలుగు గంగ ప్రాజెక్ట్ లో భాగంగా.. సోమశిల ప్రాజెక్ట్ నుంచి వరదల కాల్వ ద్వారా నీటిని కండలేరుకి పంపిస్తారు. కండలేరు పూర్తి కెపాసిటీ 68 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 60 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా కండలేరు నుంచి వరద కాల్వల ద్వారా నీటిని బయటకు వదిలిపెడుతున్నారు. ప్రస్తుతం కండలేరు డ్యామ్ పై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతున్నారు అధికారులు. కండలేరు డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ డ్యామ్ చుట్టూ మట్టి కట్ట ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద మట్టికట్ట ఉన్న డ్యామ్ గా కండలేరుకి పేరుంది. మిగతా ప్రాజెక్ట్ లన్నిటిలో కాంక్రీట్ తో కరకట్టలు నిర్మిస్తే.. కండలేరు విషయంలో మాత్రం అక్కడి స్థానిక పరిస్థితుల వల్ల మట్టితోనే కట్ట కట్టారు. 


సోమశిలపై ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటే కండలేరు డ్యామ్ కి నీటిని విడుదల చేస్తారు. అయితే వరదల కాల్వల వెడల్పుని పెంచి ఎక్కువ సామర్థ్యంతో వాటిని నిర్మించే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. దీంతో సోమశిలపై వత్తిడి వచ్చినా ఆ నీటిని సముద్రానికి వృథాగా వదిలేయకుండా కండలేరులో పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవచ్చు. కండలేరు కింద ఆత్మకూరు, రాపూరు, గూడురు మండలాలకు సాగునీరు అందుతుంది. చెన్నైలోని పూండి రిజర్వాయర్ కు కండలేరునుంచి సత్యసాయి కెనాల్ ద్వారా నీటిని పంపిస్తారు. చెన్నై తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేస్తారు. 


ప్రస్తుతం కండలేరు నిండుకుండలా ఉంది. దీని నుంచి కాల్వల ద్వారా నీటిని కిందకు వదిలిపెడుతున్నారు. కాల్వలు పొంగి పొర్లడంతో సమీపంలోని చెరువులు నిండి, లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో రాపూరు మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. 


Also Read: Dollar Seshadri Is No More: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత


Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు


Also Read: Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు


Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి