ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఏకమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నాయకులు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కలిసి ఆందోళన చేసి హక్కులు సాధించుకోవాలని నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ ఇతర అంశాలపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ప్రభుత్వం ముందు తమ డిమాండ్స్ ఉంచాయి. ఆదివారం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఇకపై రెండు సంఘాలు కలిసి తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించాయి.
పీఆర్సీ నివేదిక బయటపెట్టండి
అక్టోబర్ నెలాఖరుకు పీఆర్సీ ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని ఏపీ జేఏసీ గుర్తు చేసింది. పీఆర్సీ నివేదిక అడిగినా ఇప్పటి వరకూ ఇవ్వలేదని, ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వడంలేదని ఏపీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. ఇక ఉద్యమ బాట పట్టాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోందని, ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరి దగ్గరకూ వెళ్లామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న రూ. 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. కరోనా టైంలో ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామన్నారు. విధిలేక ఉద్యమబాట పడుతున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
పోరుబాట పట్టిన ఉద్యోగ సంఘాలు
పీఆర్సీతో పాటు పలు డిమాండ్లతో ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇవాళ విజయవాడలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగుల డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు కారణంగానే ఉద్యోగులు ఉద్యమబాట పట్టారన్నారు.
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ
- డిసెంబర్ 01న సీఎస్ కు వినతిపత్రం అందిస్తారు
- డిసెంబర్ నెల 7 నుంచి 10 వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు
- డిసెంబర్ 10న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు
- డిసెంబర్ 13న అన్ని తాలూకా ముఖ్య కేంద్రాల్లో నిరసన
- డిసెంబర్ 16న అన్ని తాలూకా ముఖ్య కేంద్రాల్లో ధర్నాలు
- డిసెంబర్ 21న జిల్లా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నాలు
- డిసెంబర్ 27న విశాఖలో, డిసెంబర్ 30న తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో ప్రాంతీయ సదస్సులు
- జనవరి 6న ఒంగోలులో మహా ప్రదర్శన
Also Read: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పాం: టీడీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి