Supreme Court On AP Govt : పోలవరం ప్రాజెక్టు పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  పర్యావరణ నష్టానికి ఏపీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించింది.  లాయర్లకు ఫీజులు చెల్లించడానికి డబ్బు వెచ్చిస్తున్న ఏపీ సర్కార్,  పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించలేదని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.  పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటి వరకు లాయర్లకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో నోటీసు ఇస్తామని తెలిపింది.  ఒక్క కేసుకు ఎంతమంది లాయర్లను ఎంగేజ్ చేస్తారన్న సుప్రీంకోర్టు...  ప్రభుత్వాలకు లాయర్లను రంగంలోకి దించడానికి ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణపై లేదంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలపై రూ.120 కోట్లు జరిమానా చెల్లించాలని ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఎన్జీటీ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.  


పర్యావరణ రక్షణపై శ్రద్ధ లేదా?


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన పర్యావరణ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని ఏపీ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణపై ఎందుకు చూపడంలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్   ఏపీ రూ.120 కోట్లు జరిమానా విధించింది. పర్యావరణ ఉల్లంఘనలపై 3 ప్రాజెక్టులకు సంబంధించి ఎన్జీటీ తీర్పు వెల్లడించింది. ఎన్‌జీటీ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.  మూడు అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేర్వేరు అప్పీళ్లు దాఖలు చేసింది. ఏపీ అప్పీళ్లపై జస్టిస్‌ రస్తోగి, జస్టిస్‌ రవికుమార్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ప్రతివాది పెంటపాటి పుల్లారావు తరఫు న్యాయవాది ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  


ఒక్క కేసులో ఇంత మంది న్యాయవాదులా? 


సీనియర్‌ లాయర్లను రంగంలోకి దించి కేసులు వాదించేందుకు తీసుకుంటున్న శ్రద్ధ పర్యావరణ పరిరక్షణలో ఎందుకు లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో లాయర్లకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇస్తామని తెలిపింది. ఎన్‌జీటీ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. పోలవరం, పురుషోత్తమపట్నం, పులిచింతలపై ఎన్జీటీ తీర్పులపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.  


ఎన్జీటీ జరిమానా


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇటీవల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున  భారీ జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా రూ. 120 కోట్లను జరిమానాగా విధించారు.  పురుషోత్తమపట్నంకు రూ. 24.56  కోట్లు,  పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్టీటీ ఆదేశించింది. 


Also Read : కళ్యాణమస్తు పథకంలో టెన్త్‌ తప్పనిసరి రూల్‌ అందుకే పెట్టాం: సీఎం జగన్


Also Read : Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా