మానసిక వైకల్యంపై వైద్యులు టెంపరరీ సర్టిఫికెట్లు జారీ చేసినా, వారికి పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా జులై, డిసెంబర్లలో మంజూరు ప్రక్రియ చేప‌ట్టిన ప్రభుత్వం ఇందులో భాగంగా మానసిక వైకల్యంపై టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఈ డిసెంబర్‌లో పెన్షన్లు మంజూరు చేయాల‌ని నిర్ణయించింది. 


మహిళా శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్ష జ‌రిపారు. స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం ఏర్పాటు చేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలకు కూడా ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలన్న సీఎం... టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. 


అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్ఛారణల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల‌ని సూచించారు. పాఠశాల విద్యా శాఖ తో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలన్న సీఎం, అన్నీ కూడా బైలింగువల్‌ టెక్ట్స్ బుక్స్‌ ఉండాలన్నారు. అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం, పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారంతో పగడ్బందీ విధానాలు అమలు చేయాలని, నాణ్యత పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాల‌ని సూచించారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలని సూత్రప్రాయగా నిర్ణయం తీసుకున్నారు. పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలని ఆదేశించారు.


బాల్య వివాహాల పై సీఎం ఆరా...


బాల్య వివాహాల‌ను పూర్తిగా నివారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణమస్తు పథకం బాల్యవివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని జ‌గ‌న్ అన్నారు. అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలన్న సీఎం, ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల‌ని, ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలన్నారు. అంగన్‌వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్‌వాడీలో ఉంచాలని, పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పగించాలన్నారు. 


సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాలమేరకు అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తుట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని, పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందని సీఎంకు వివ‌రించారు. 


దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని, దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. జువైనల్‌ హోమ్స్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. జువైనల్‌ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.