CM Chandrababu Welcome The Order Of Supreme Court: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించి స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 






తీర్పును స్వాగతించిన మంత్రి లోకేశ్


మరోవైపు, మంత్రి నారా లోకేశ్ సైతం సుప్రీం తీర్పును స్వాగతించారు. 'పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు సిట్‌లో భాగమైన ఏజెన్సీల అదనపు మద్దతుతో కొనసాగుతోన్న దర్యాప్తును పటిష్టం చేయాలనే సుప్రీం నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు, హోంమంత్రి అనిత సైతం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. 'శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన  విషయం. సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఈ వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తప్పు చేయనివారు భయపడరు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు.' అని అనిత ప్రశ్నించారు.






సుప్రీంకోర్టు తీర్పు ఇదే


తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి వేర్వేరు పిటిషన్ల సందర్భంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారించాలని సూచించింది. ప్రస్తుతం వేసిన సిట్ నుంచి ఇద్దరు, సీబీఐ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి మరొకరు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ దర్యాప్తు సంస్థకు నాయకత్వం వహించబోతున్నారు. మొత్తం దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్‌ పర్యవేక్షించబోతున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ స్వతంత్ర దర్యాప్తునకే మొగ్గు చూపింది.


Also Read: Sharmila On Pawan : మోడీ డైరక్షన్‌లో పవన్ - రాహుల్‌ను విమర్శించే అర్హత ఉందా - షర్మిల విమర్శలు