Lulu Group Chairman Met CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ (Lulu Group) ఆసక్తి చూపుతోంది. సీఎం చంద్రబాబుతో (CM Chandrababu) శనివారం ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనంతరం వైసీపీ హయాంలో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకొస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ ఛైర్మన్‌కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్‌తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.
ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. swarnandhra.ap.gov.in/suggestions ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు పంపాలని సూచించారు. ఇలా చేసిన అనంతరం ఇ - సర్టిఫికెట్ ద్వారా అభినందనలు అందుకోవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ @ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని.. 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని చెప్పారు.
Also Read: Chandrababu: 'స్వర్ణాంధ్ర సాధనకు మీ సూచనలు పంపండి' - ట్విట్టర్ వేదికగా ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు