Chandrababu Called People To Make Suggestions: స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. swarnandhra.ap.gov.in/suggestions ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు పంపాలని సూచించారు. ఇలా చేసిన అనంతరం ఇ - సర్టిఫికెట్ ద్వారా అభినందనలు అందుకోవచ్చని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ @ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని.. 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని చెప్పారు. ఏపీ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరుల ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటూ సమస్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామని అన్నారు.






'అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


మరోవైపు, వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. మనం ప్రజలకు నిజం చెప్పే లోపే జగన్ (YS Jagan) అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్నారని.. ప్రభుత్వం - పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు. అటు, అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసుల తీరుపై సీఎం వద్ద నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైసీపీ నేతలంటూనే.. ఈ ఘటనలో రాజకీయ ప్రమేయం లేదని చెప్పడాన్ని.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. విచారణ పూర్తి చేయకుండానే అలా అనడం సరి కాదని.. కొందరు పోలీసుల అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు.


గుర్రం జాషువాకు నివాళి


అనంతరం మహా కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సమ సమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రధాత జాషువా అని.. తన జీవితంలో అడగడుగునా కుల వివక్షను ఎదుర్కొని తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి అని కొనియాడారు. అటు, విజయవాడ కలెక్టరేట్‌లో గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.






Also Read: Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో