Andhra Pradesh : డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పూర్తి స్థాయిలో ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో చివరి ప్రశ్నకు ఆయన మరింత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆ చివరి ప్రశ్న ఏంటి..? పవన్ దానికి ఎలాంటి సమాధానం ఇచ్చారు..? ఆ సమాధానం కూటమి రాజకీయాలపై ప్రభావం ఏమైనా చూపిస్తుందా..? మీరే చదవండి.


మీ పార్టీలో చాలామంది నాయకులు, కార్యకర్తలు మిమ్మల్ని తర్వాతి స్థానంలో అంటే.. సీఎం సీటులో చూడాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అది సాధ్యమేనా..? అని అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానమిచ్చారు. తన జీవితంలో ఏదీ కావాలని కోరుకోలేదని, అన్నీ తన జీవితంలో అనుకోకుండానే జరిగిపోయాయని చెప్పారు పవన్. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం(Deputy CM) హోదా తాను ఏనాడూ కావాలనుకోలేదని, అసలు తాను నటుడు అవుదామని కూడా అనుకోలేదని, రాజకీయ నాయకుడు కావాలని కూడా తాను అనుకోలేదని చెప్పారు పవన్. కాలమే మనల్ని నడిపిస్తుందన్నారు. ప్రజలు మంచి చేయాలని, దేశానికి మంచి చేయాలని తాను ఈ జర్నీ మొదలు పెట్టానని, అందులో ఇవన్నీ వచ్చి చేరాయన్నారు. 


తానెప్పుడూ ఎలాంటి పొజిషన్ కోరుకోలేదని, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని, ఓ ఆర్గానిక్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు పవన్ కల్యాణ్. భవిష్యత్తులో కాలం గడిచేకొద్దీ తాను సీఎం అయితే మంచిదేనన్నారు. ఒకవేళ కాలేకపోయినా ఓకేనన్నారు. ప్రజలకు మంచి జరిగితే చాలు అని తాను అనుకుంటున్నట్టు వివరించారు. ఎవరు ఏ పదవిలో ఉన్నా అంతిమంగా ప్రజలకు మంచి జరగడమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు పవన్ కల్యాణ్. 




చంద్రబాబు నాయకత్వంపై మరోసారి పవన్ కల్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఆయన అనుభవం, సామర్థ్యం రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. గతంలో కూడా పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, తన సీఎం పదవి విషయంపై అడిగిన ప్రశ్నకు కూడా ఆయన చంద్రబాబు ప్రస్తావన తేవడం విశేషం. ప్రస్తుతం చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులైన నాయకుల అవసరం రాష్ట్రానికి ఉందన్నారు పవన్. ఆయన అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పదవి కూడా తాను అడిగి తీసుకుంది కాదన్నారు. ఒకవేళ తాను అంతకంటే ఉన్నత స్థానానికి వెళ్లాలంటే, వెన్నుపోటు రాజకీయాలేవీ లేకుండా ఆర్గానిక్ వే లోనే అది జరగాలన్నారు. 


అంటే సీఎం పదవిని పవన్ కావాలనుకోవడం లేదు. అలాగని ఆ సమయం వస్తే తాను దూరంగా ఉంటానని కూడా ఆయన చెప్పలేదు. సీఎం సీటుపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఇప్పటికిప్పుడు ఆ అవసరం రాదని, చంద్రబాబు వంటి సమర్థులైన సీఎం నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారాయన. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు టీడీపీ నేతలు కూడా పవన్ హుందాగా సమాధానం చెప్పిన తీరుని మెచ్చుకుంటున్నారు. 


మరోవైపు జగన్ అంటే తనకు కోపం లేదని కొన్ని సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం అందరిపై ఉందని అదే విషయంపై మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ వీడియోను జనసేన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 






Also Read: భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు