Andhra Pradesh: కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన నాయకులు, ఇప్పుడు మత రాజకీయాలు మొదలు పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా(Roja). ఏపీలో ప్రస్తుతం మత రాజకీయాలు జోరందుకున్నాయని అన్నారు. మధురై మీనాక్షి ఆలయం(Meenakshi temple)లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బయటకు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan), నాగబాబు(Nagababu)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా.


సీఎం చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి రెండూ లేవని విమర్శించారు రోజా. ఆయన పూజలు చేసే సమయంలో కూడా కాళ్లకు షూ వేసుకుంటారని అన్నారు. కనీసం షూ విడిచి పూజలు చేయాలని కూడా ఆయన అనుకోరని, కొన్ని ఫొటోలను చూపించారు రోజా. చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేస్తున్నట్టుగా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయనన్నారు. ఇక పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్ అని, ఆయనతోపాటు ఆయన పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారని చెప్పారు రోజా. వీళ్లంతా సనాతన ధర్మం గురించి మాట్లాడటం షాకింగ్ గా ఉందన్నారు. పవన్ అన్నయ్య నాగబాబు గతంలో దేవుడే లేడని అన్నారని, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉందని, ఇలాంటి వారంతా ఇప్పుడు దేవుడి గురించి గొప్పగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 


తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నట్టు తెలిపారు రోజా. 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికే చంద్రబాబు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. దేవుడితో ఆయన ఆడుకుంటున్నారని, అలాంటి వారికి దేవుడే తగిన శాస్తి చేస్తారన్నారు. జగన్ ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ఇప్పుడిలా దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని అసుల చంద్రబాబుకి దేవుడిపై భక్తి, విశ్వాసం ఏవీ లేవన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారని.. వారు ఏ విచారణ జరిపించినా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు తిరుమల లడ్డూలో కల్తీయే జరగలేదని తేల్చి చెప్పారామె. సీబీఐ ఎంక్వయిరీ వేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రోజా. 


జగన్ పిలుపు మేరకు ఈరోజు వైసీపీ నేతలు వివిధ ఆలయాల్లో పాప ప్రక్షాళణ పూజలు చేస్తున్నారు. చంద్రబాబుకి బుద్ధి రావాలని తాను అన్ని ఆలయాలు తిరిగి పూజలు చేయిస్తున్నాని చెప్పారు రోజా. వీలైతే ప్రజలకోసం పనిచేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబుకి సూచించారు. 


ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. జగన్ తిరుమల పర్యటన రద్దయిన తర్వాత ఇది మరో మలుపు తిరిగింది. తనను తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారని, ఇదెక్కడి న్యాయం అని, దేశంలో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు జగన్. చంద్రబాబు మాత్రం తిరుమలలో ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందేనని చెప్పారు. నెయ్యులో కల్తీ జరిగితే, ఆ విషయంపై స్పందించకుండా ఆలయంలో ప్రవేశానికి అడ్డంకులంటూ జగన్ చెప్పడం సరికాదన్నారు చంద్రబాబు. 


Also Read: లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?