Bear Saved Its Cub From Tiger In Maharastra: అమ్మ.. ఈ సృష్టిలో గొప్ప పదం. ప్రతి క్షణం తన బిడ్డలు బాగుండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. తన పిల్లల జోలికి వచ్చినా.. ఏదైనా హాని కలిగించినా ఏ మాతృమూర్తి సహించదు. వారిని రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తుంది. ఎవరితోనైనా పోరాడుతుంది. ఇది మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ చూస్తాం. ఓ ఎలుగు తన బిడ్డను కాపాడుకునేందుకు పులితో వీరోచితంగా పోరాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలుగు ధాటికి పులి తోక ముడిచింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని తాడోబా - అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో వెళ్తుండగా అనుకోని ప్రమాదం ఎదురైంది. ఓ పులి ఎలుగు కూనపై దాడికి దిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లి ఎలుగు పులికి ఎదురెళ్లింది. 






తన ప్రాణాలను సైతం లెక్కచేయక పులితో వీరోచితంగా పోరాడింది. దీంతో చేసేది లేక పులి అక్కడి నుంచి తోక ముడిచింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. 'ఓ తల్లి తన బిడ్డ కోసం ఎంత ధైర్యం ప్రదర్శించిందో' అంటూ ఓ నెటిజన్ స్పందించగా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బిడ్డ ప్రాణాల కోసం తల్లి ఇలానే సాహసం చేస్తుందని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు.


Also Read: Fire Break: టాటా ఐఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు - ఎగిసిపడిన మంటలు, షాకింగ్ వీడియో