Chandrababu Naidu: విశాఖపట్టణంలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. పంద్రాగస్టు సందర్భంగా ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు నిర్వహించిన సమైక్య వాక్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు పార్టీ నేతలు, నగర ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర చంద్రబాబు జాతీయ జెండా పట్టుకుని నగర వాసులతో కలిసి నడిచారు. తొలుత ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంజీఎం గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులతో చంద్రబాబు చర్చించారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ఆని చంద్రబాబు అన్నారు. ప్రపంచాన్ని జయించగలిగే సత్తా తెలుగువారికి ఉందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు బధ్యతగా ఆలోచించానని, అందుకునే ఈరోజు డాక్యుమెంట్ తయారు చేసుకుని ఇక్కడికి వచ్చానన్నారు. విజన్ డాక్యుమెంట్‌తో భారతదేశం ఎలా ఉండబోతోందో చెప్పడమే కాకుండా, ఇక్కడ ఉండే తెలుగు జాతిని ప్రపంచంలో ఒక అగ్రస్థానంలో నిలపడానికి, ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని ఆలోచనతోనే కార్యక్రమానికి వచ్చానన్నారు.
తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థికాభివృద్ధి దిశగా దేశం పయనించేలా చేశారని అన్నారు. అది కేవలం తెలుగువారి ప్రత్యేకత అన్నారు. ఆర్థిక సంపద సృష్టించబడుతోందని, కానీ ఆ సంపద కొంతమందికి పరిమితం అవుతోందన్నారు. ఎస్సీలను ఎస్టీలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, ఆటో మెబైల్ కార్మికులను అండగా ఉండాల్సి ఉందన్నారు. మహిళను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. యువతను ఒకటే కోరుతున్నానని, రాబోయే వంద సంవత్సరాలు యువతదే అన్నారు. దేశాభివృద్ధిలో యువత, విద్యార్థులు, పిల్లలదే కీలక పాత్ర అన్నారు.
తెలుగువారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందన్నారు. దేశ అభివృద్దిలో తెలుగుజాతి ప్రథమస్థానంలో ఉండాలని ఉన్నారు. భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని, అప్పటి నుంచి వంద ఏళ్లలో 2047 నాటికి భారత్ ఎలా ఉండాలో చూపించేదే విజన్ 2047 అన్నారు. వందేళ్లలో భారత్ అభివృద్ధిని ఆవిష్కరించేదే ఈ విజన్ డాక్యుమెంట్ అన్నారు. ఇందులో ఇండియా, ఇండియన్స్, తెలుగుస్ నినాదంతో డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు.
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా దేశం ఆర్థికాభివృద్ధిలో పరుగులు తీసిందన్నారు. అంతకుముందు భారతదేశాన్ని చులకనగా చూసేవారని, భారతదేశం శక్తిని సమర్థవంతంగా వినియోగించలేకపోయామన్నారు. ఆర్థిక సంస్కరణలతో ఒక శక్తి వంతమైన ఆర్తిక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అదే సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిందన్నారు. ఇంటర్నెట్ కారణంగా ఎక్కడ ఏం జరిగినా రియల్ టైమ్‌లో చూసే అవకాశం దక్కిందన్నారు.
తాను సీఎం అయ్యాక ఏపీలో రెండో దశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికినట్లు చంద్రబాబు చెప్పారు. తన హయాంలో భారత దేశంలో మొదటి సారిగా పవర్ సెక్టార్‌లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసింది తనేనని చెప్పారు. 2004 నాటికి ఆంధ్రప్రదేశ్ మిగులు కరెంట్ సాధించిందన్నారు. ఈనాడు ఏపీలో ఏం చేపట్టినా అన్నీ తన హాయంలో బీజం పడినవే అన్నారు.
రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ పవర్ ప్రాజెక్ట్ జేగురుపాడు, తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో నిర్మించామన్నారు. ఓపెన్ స్కై పాలసీలో ఎమిరేట్స్ విమానం హైదరాబాద్ వచ్చిందన్నారు. నేషనల్ హైవే లపై తాను మలేషియాకు వెళ్లి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తే కేంద్రం ఆమోదించిందన్నారు. బయోటెక్నాలజీ, ఫార్మా, ఐటీ సంస్థలకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చామన్నారు.