అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని జగన్ కోర్టును కోరారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో నమోదైన ఐదు క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అన్ని పిటిషన్ల విచారణకు వచ్చే మంగళవారం (జులై 1)కి వాయిదా వేసింది. అప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
రెంటపాళ్ల పర్యటనలో విషాదం..
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి చనిపోయిన సింగయ్య మృతి విషయంలో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేయాలని జగన్ తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతుండగా, మరోవైపు సింగయ్య మృతిపై వరుస పిటిషన్లు రావడంతో అన్ని పిటిషన్ల విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పోలీసులు మాజీ సీఎం జగన్‌ను ఏ 2గా చేర్చారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు చెందిన కార్యకర్త ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల విగ్రహావిష్కరణకు వైఎస్ జగన్ వెళ్లారు. కానీ ఆ పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డులో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వృద్దుడు చనిపోయాడు. ఢీకొట్టిందని జగన్ కాన్వాయ్ వాహనం కాదనుకుని పోలీసులు భావించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల తర్వాత సింగయ్య పడి చనిపోయింది జగన్ కారేనని కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు ఎస్పీ సతీస్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. సింగయ్య చనిపోవడానికి జగన్ కారే కారణమని గుర్తించినట్లు తెలిపారు. అనంతరం కేసులో జగన్ పేరును చేర్చారు.
జగన్ కారు తనిఖీ చేసిన అధికారులు
అమరావతి: రవాణా శాఖ అధికారులు మాజీ సీఎం జగన్ కారును శుక్రవారం తనిఖీ చేశారు. జగన్ కారును జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు పోలీసులు. ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు కిందపడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడని తెలిసిందే.