Vijayawada-Guntur Railway Line Works: విజయవాడ-గుంటూరు రైల్వే మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు చాలా వేగంగా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పనులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ సర్వే పూర్తైంది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కూడా అధికారులు దక్షిణ మధ్య రైల్వేకు అందజేశారు. అక్కడ కూడా క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫైల్ రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు.
సుమారు రూ.1,200 కోట్లు అంచనాతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య కేవలం రెండు లైన్లు మాత్రమే వర్కింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ రూట్‌లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. భారీ సంఖ్య రైళ్లు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది రైళ్ల సమయాలపై ప్రభావం చూపుతోంది. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్‌లో జాప్యం జరుగుతోంది.
మూడో లైన్ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారు?
విజయవాడ-గుంటూరు మధ్య నెలకొన్న రద్దీ సమస్య నివారణకు మూడో రైల్వే లైన్ నిర్మాణం అవసరం. ఈ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నా కార్యరూపం దాల్చలేదు. మూడోలైన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. అమరావతిలో కార్యకలాపాలు కూడా ఊపందుకుంటే ఈ రద్ది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూడో లైన్ పూర్తి అయితే రవాణాపై భారం పడకుండా ఉంటుంది. వివిధ మార్గాల్లో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.
విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ఈ మధ్యనే అధికారులు పూర్తి చేశారు. డీపీఆర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పంపించారు. అక్కడ కూడా అధికారులు అప్రూవల్ చేసి రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపారు. భూసేకరణ, రైల్వే ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధి వంటి చాలా ఆంశాలను ఈ డీపీఆర్‌లో చేర్చారు.
ఈ మూడో రైల్వేలైన్ వల్ల యూజ్ ఏంటీ వేగవంతమైన ప్రయాణం: మూడో లైన్ ఏర్పాటు వల్ల రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. రద్దీ తగ్గడం వల్ల రైళ్ల షెడ్యూల్‌లో జాప్యం లేకుండా ఉంటుంది. ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
రైళ్ల సంఖ్య పెరుగుదల: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.
ఆర్థిక వృద్ధి: విజయవాడ, గుంటూరు జంట నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల వాణిజ్యం, పరిశ్రమలు, సేవల రంగంలో వృద్ధి సాధ్యమవుతుంది. చవకైన రవాణా: రైల్వే ప్రజా రవాణాలో అత్యంత చవకైన, సమర్థవంతమైన మార్గం. మూడో లైన్ ఏర్పాటు వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయి.
గూడ్స్ రవాణా సామర్థ్యం: గూడ్స్ రైళ్లకు ప్రత్యేక లైన్ కేటాయించడం వల్ల వాణిజ్య రవాణా సామర్థ్యం పెరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది.
అమరావతికి ఊతం: అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో రవాణా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. మూడో రైల్వే లైన్ ఏర్పాటు ఈ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.