GFST Tourism Conclave held in Vijayawada | విజయవాడ: విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టూరిజం కాన్ క్లేవ్ లో భాగంగా నడిచే హోటల్ రూములుగా తీర్చిదిద్దిన కారవ్యాన్ లను యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. క్యారవాన్ ప్రారంభించిన తరువాత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా క్యారవాన్ లోనే స్టే చేస్తానని, హోటల్స్ లాంటివి తాను ప్రిఫర్ చేయనని తెలిపారు. హైజెనిక్ ముఖ్యమని, అలాగే ఇందులో అన్ని వసతులు ఉంటాయన్నారు చంద్రబాబు. 

పర్యాటక రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా టూరిజం కాన్ క్లేవ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఇదివరకే పర్యాటక ప్రాజెక్టులకు  ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.10,039 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటకుల కోసం అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తదితరులు పాల్గొన్నారు.