మన దేశం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉండాలని కోరుకోవడం తన బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ వైఖరి ప్రతి ఒక్కరిపైనా ఉండాలని అన్నారు. అందులో తెలుగు జాతి ఎప్పుడూ ముందు వరసలో ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే విజన్ 2047ను తీసుకొచ్చానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు విశాఖపట్నం పాదయాత్రలో భాగంగా ‘ఇండియా ఇండియన్స్ తెలుగూస్ విజన్ 2047’ పేరుతో ప్రణాళికను ఆవిష్కరించారు.


‘‘రాష్ట్రం విడిపోయాక తాను నవ్యాంధ్రప్రదేశ్ కోసం విజన్ 2029తో ముందుకు వచ్చానని అన్నారు. ‘‘అప్పుడు రాష్ట్రంలో ఉన్న వనరులతో ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని భావించాను. పరిశ్రమల కోసం నా అనుభవంతో పని చేశాను. అన్ని వర్గాల సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో అమరావతి నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు దుర్మార్గుడు వచ్చి మొత్తం పాడు చేశాడు.


భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంచనా ఉంది. 2047 నాటికి అది రెండో స్థానానికి చేరుతుంది. కానీ, చైనాను దాటేసి మొదటి ఆర్థిక వ్యవస్థ సాధించగలం. 21వ సెంచరీ మొత్తం భారత దేశానిదే అవుతుంది. 2047 నాటికి పేదరికం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. ఇండియా గ్లోబల్ లీడర్ అవ్వడానికి ఐదు వ్యూహాలను చంద్రబాబు వివరించారు.


ఇండియా గ్లోబల్ లీడర్ అవ్వడానికి 5 వ్యూహాలు


1. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, కాలుష్యాన్ని నియంత్రించడం (Decarbanation), డిజిటలైజేషన్


2. దేశ వ్యాప్తంగా సమగ్ర నీటి సద్వినియోగం


3. టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఆఫ్ ఫ్యూచర్


4. Demographic Management (దేశంలో పాపులేషన్ కంట్రోల్ చేయకపోతే 2047 నాటికి అపార యువశక్తి మన సొంతం అవుతుంది)


5. P4 Model of Welfare (పేదవాడిని కూడా పైకి తేగలగడం)
Indian Citizen to serve Global Economy (దేశంలోని ప్రతి వ్యక్తి తన సేవలను ఏదో ఒక రూపంలో ప్రపంచానికి అందించగలగాలి)


దేశం కోసం విశాఖలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక విజన్ ద్వారా పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. దేశంలో ఫ్రీ ఫ్రం కరెప్షన్, ఫ్రీ ఫ్రం క్రైం అనేది సాక్షాత్కారం కావాలి. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన వారు నాటి ప్రధాని పివి నరసింహారావు. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టి జరుగుతోంది. అయితే, ఆ సంపద కొందరికే పరిమితం అవుతోంది. అందుకే పేదరికం లేని సమాజం కోసం ఒక విజన్ అవసరం. దానికోసమే విజన్ 2047 కు రూపకల్పన చేశాను. భారత దేశ యువత చాలా శక్తి వంతులు. వచ్చే 100 ఏళ్లు యువ శక్తిదే.


ప్రపంచంలో భారతీయులు శక్తివంతమైన జాతిగా ఉన్నారు. వారిలో తెలుగు వారు ముందున్నారు.  ప్రతి వ్యక్తికి...ప్రతి పౌరుడికి విజన్ ఉంటుంది. తన పిల్లలను ఎలా చదివించాలి. ఎలా తీర్చిదిద్దాలి అని ఆలోచిస్తారు. దాని కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. అలాగే దేశానికి కూడా విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్ ను రూపొందించాను.


2047 నాటికి ఇండియా ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాను. దీనిపై మేథావులు, నిపుణులు స్పందించాలి. తమ సూచనలు సలహాలు ఇవ్వాలి. నీరు అత్యంత విలువైనది. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంది. నదుల అనుసంధానం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సాగు, తాగునీటి కొరత లేకుండా చేయవచ్చు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానంపై ఖర్చు పెట్టాం. భారత దేశానికి ఉన్న యువ శక్తి, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.