Bandi Sanjay Letter To CM Chandrababu On Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న అంశంపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay).. ఏపీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) లేఖ రాశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి తయారీలో జంతువుల కొవ్వు వినియోగం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇది క్షమించరాని నేరమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని.. దీనిపై ఏపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 'ఈ వ్యవహారం శ్రీవారి భక్తులను, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తోంది. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడుకొండలను రెండు కొండలకే పరిమితం చేశారని విమర్శలు వచ్చినా స్పందించలేదు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని.. అన్న ప్రసాదం నుంచి లడ్డూ ప్రసాదం వరకూ అన్నింటినీ సర్వ నాశనం చేశారన్న మీ వ్యాఖ్యలతో ఇది నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం అత్యంత నీచం. ఇది హిందూ ధర్మంపై భారీ కుట్రగానే భావిస్తున్నాం. టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారు. క్షమించరాని నేరానికి ఒడిగట్టారు.' అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
'సీబీఐతో విచారణ చేయించాలి'
అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఈ కల్తీ దందా జరిగే ఛాన్స్ లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తేనే ఈ అంశంలో నిజానిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని.. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
మరోవైపు, లడ్డు తయారీకి వాడే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు వాడారన్న అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటు, కేంద్ర మంత్రులు సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు.