Alpha Milk Products Laddu Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఎక్కువగా అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ పేరు ప్రచారంలోకి వస్తోంది. ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. టెండర్లు వేసి.. రివర్స్ టెండర్లు వేసి .. అతి తక్కువ ధరలకు కాంట్రాక్టులను నిరాటంకంగా దక్కించుకుంది. గత మూడేళ్లుగా టీటీడీకి అత్యధికంగా ఈ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కంపెనీపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు.
అల్ఫా కంపెనీపై టీడీపీ నేతల ఆరోపణలు
అల్ఫా కంపెనీ బటర్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి.. టీటీడీకి సరఫరా చేసిందని తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు , టీడీపీ నేత ఓవీ రమణ ఆరోపణలు చేశారు. ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని అంటున్నారు. సామర్థ్యం లేని కంపెనీకి.. నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చి ఇస్తారో చూసుకోకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని అంటున్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారు! టీటీడీ ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
రివర్స్ టెండర్లలో భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్న అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్
వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు, రివరస్ టెండర్ల విధానాన్ని టీటీడీలోనూ అమలు చేశారు. ఈ కారణంగా ఏళ్ల తరబడి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి తక్కువ ధరకు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొన్నిసార్లు టెండర్లలో పాల్గొనలేదు. పాల్గొన్నా.. అతి తక్కువ ధరకు ఇవ్వడానికి సిద్ధపడలేదు. అయితే అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ మాత్రం టెండర్లకు .. రివర్స్ టెండర్లకు తగ్గించుకుంటూ వెళ్లి కాంట్రాక్టులు పొందింది.
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
రూ. 610కి టెండర్ -రివర్స్ టెండర్‌లో రూ. 424 కే !
అల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ అతి తక్కువకు టెండర్లు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున తగ్గింపులు ఇచ్చింది. టెండర్లలో ఒక రేటు వేస్తే.. రివర్స్ టెండర్లలో మరింత తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకుంది. గత ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ రూ. 610 కి దాఖలు చేసింది. కానీ రివర్స్ టెండర్లలో మాత్రం రూ. 424కి మాత్రమే సరఫరా చేస్తామని అంగీకరించింది. ఒక్క కేజీకే రూ. 190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు దక్కించుకుంది. 2022లోనూ ఇలా రివర్స్ టెండర్లలో ఇలా అల్ఫా కంపెనీ టెండర్లు దక్కించుకుంది. టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు కోట్ చేసి టెండర్లు పొందింది.
ఇలా వైసీపీ అధికారలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండర్ల ద్వారా అల్ఫా కంపెనీ ఎక్కువ కాంట్రాక్టు పొందింది. ఈ కంపెనీ చుట్టూనే వివాదం నెలకొంది. టీడీపీ నేతలు అల్ఫా కంపెనీ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.