Ghee used for making Srivari Laddu is becoming a major issue for YSRCP : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు దేవదేవుడు శ్రీనివాసుడు. ఆయనను ఒక్క క్షణం దర్శనం చేసుకుని ఒక్క ముక్క లడ్డూ  ప్రసాదాన్ని నోట్లో వేసుకునే భాగ్యం కోసం ఖండాంతరాలు దాటి వస్తారు. కొండపై  ఎన్ని గంటలైనా క్యూ లైన్లలో ఎదురు చూస్తారు. అలాంటి చోట యంత్రాంగం  భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ప్రసాదం తయారీ కోసం వాడిన నెయ్యి విషయంలో బయటకు వచ్చిన సంచలన నిజాలు హిందూ సమాజన్ని నివ్వెర పరుస్తున్నాయి. ఇప్పుడీ నిందలన్నీ వైసీపీ మీదనే పడుతున్నాయి. సమర్థించుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. 


చంద్రబాబు ఆరోపణలతో కలకలం 


పాలన ప్రారంభించి వంద రోజులు అయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  చంద్రబాబు వైసీపీ పాలనలో జరిగిన దురాణాలను సరి చేస్తున్నామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో తిరుమలలో జరిగిన ఘోరాన్ని బయట పెట్టారు. లడ్డూ ప్రసాదంలో  జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారన్నారు. చంద్రబాబు బయట పెట్టిన మాటలు సంచలనం సృష్టించాయి. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో.. దుమారం రేగింది. వైసీపీ నేతలు అప్పటికప్పుడు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ఘోరం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆధారాలు  బయట పెట్టాలని సవాల్ చేశారు. 


తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు


ఆధారాలు  బయట పెట్టడంతో వైసీపీకి గడ్డు పరిస్థితి


దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ సవాల్  చేశారు. ఆ తర్వాత కాసేపటికే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రె్స మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్టులు విడుదల చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరుమలలో లడ్డూ ప్రసాదం, అన్న  ప్రసాదంలో క్వాలిటీ ఎందుకు  తగ్గిపోయిందో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు నిపుణులతో కమిటీని నియమించారు. ఆ తర్వాత ఈవో శ్యామలరావు.. సరఫరా చేస్తున్న  పదార్థాలన్నింటినీ దేశంలో పేరెన్నికగన్న ల్యాబుల్లో టెస్టులకు పంపించారు. నెయ్యి విషయంలో వచ్చిన  రిపోర్టును చూసిన వెంటనే.. మొత్తం ఆ నెయ్యి వాడకాన్ని నిలిపివేసి.. ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ ల్యాబ్ రిపోర్టు విషయంలో వైసీపీ ఎదురుదాడికి దిగడం తప్ప మరో మార్గం లేదు. 


నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?


విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకున్న అల్ఫా కంపెనీ


నిజానికి ఈ వ్యవహారంలో మొత్తం ఏం జరిగిందో ఆధారాలతో సహా సేకరించిన తరవాతనే చంద్రబాబు బయట పెట్టారని తెలుస్తోంది. ఈ విషయంలో నెయ్యి కాంట్రాక్ట్ పొందిన సంస్థల్లో ఒకటైన అల్ఫా కంపెనీ.. విదేశాల నుంచి  బటర ఆయిల్ ను దిగుమతి చేసుకుంది. నెయ్యిలో కల్తీ చేసి టీటీడీకి సరఫరా  చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు టీటీడీ వద్ద ఉన్నాయి. ఈ మొత్తం  వ్యవహారంలో విచారణ జరిపించి అందరిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. 


వైసీపీపై ఇప్పటికే అన్యమత ముద్ర - ఇక హిందువులూ దూరమే ! 


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రిస్టియానిటీని పాటిస్తుంది. వారింట్లో అందరూ క్రిస్టియన్లే. జగన్ కూడా ఎన్నికల్లో గెలవగానే జెరూసలేం వెళ్లి వచ్చారు. ఎలా చూసినా ఆయన అన్యమతస్తుడని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. హిందూ దేవుళ్ల ప్రసాదాలను క్రిస్టియన్లు తినరు. సీఎంగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు హాజరైన ఆయన ప్రసాదం తినడం ఎప్పుడూ చూడలేదని  టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ హయాంలో .. ప్రపంచంలోనే హిందువులకు దేవదేవుడైన శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారం ఆ పార్టీకి పెను శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది.