TTD News : దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు వాడారాన్న సంచలన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఊరకనే ఆరోపణలు చేయరు. బలమైన ఆధారాలు ఉండబట్టే చేసి ఉంటారని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జూలైలో నెయ్యి కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన టీటీడీ
ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీ ఈవో సీనియర్ ఐఏఎస్ శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. అప్పటి వరకూ కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. ఆయనకు అర్హతలు లేకపోయినా ఆ పోస్టు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి పెట్టారు. వెంటనే.. లడ్డూ ప్రసాదానికి వాడుతున్న పదార్థాలను తనిఖీ చేయించారు. నెయ్యిని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) లో టెస్టు చేయించారు. ఫలితాలు ఏమిటో బయట పెట్టలేదు కానీ.. వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టేశారు. బహుశా.. ఆ నివేదికలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు వెలుగులోకి వచ్చి ఉంటుందని.. దాన్ని సీఎంకు తెలియచేసి ఉంటారని భావిస్తున్నారు.
జగన్ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీ కాంట్రాక్టర్లకు నెయ్యి సరఫరా బాధ్యతలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత క్వాలిటీతో ఉన్న పదార్థాలతోనే సరఫరా చేస్తారు. గత ఇరవై ఏళ్లకుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ కు చెల్లిస్తున్న ధర కంటే తక్కువ ధరను నిర్ణయిస్తూ టెండర్లు పిలిచారు. ఆ ధర ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నష్టాలు వస్తాయని నందిని టెండర్లలో పాల్గొనలేదు. ఈ కాంట్రాక్టులను.. యూపీకి చెందిన రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు నెయ్యి ఎలా తయారు చేస్తాయన్నది పట్టించుకోలేదు. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, క్వాలిటి లిమిటెడ్ వంటి కంపెనీలకు ఇచ్చారు. నిజానికి ఇలాంటి నెయ్యి పేరు మోసిన డెయిరీలే సిద్దం చేయగలవు. వీరు ఇచ్చే నెయ్యి క్వాలిటీని స్వతంత్ర సంస్థలతో కాకుండా తామే పరీక్షిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఆ కంపెనీలు సరఫరా చేసిన నెయ్యిలోనే జంతువుల కొవ్వు !
నిజానికి శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి అవసరమైన అత్యంత నాణ్యమైన నెయ్యి.. ఆ యూపీ కంపెనీలు సరఫరా చేసినంత తక్కువ ధరకు రావు. కేవలం నందిని బ్రాండ్ నెయ్యి టెండర్లలో పాల్గొనకుండా చేయడానికే ఆ ధరను నిర్ణయించి ఉద్దేశపూర్వకంగా ఆ కంపెనీని తప్పించారని.. తమకు ఇష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా చేశారని అప్పట్లోనే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. కానీ టీటీడీలో ప్రతిదీ తాము టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పి టీటీడీ ఆ నెయ్యినే కొనుగోలు చేసింది.
కొంత మంది చేతిలో టీటీడీ
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డినే కీలకంగా వ్యవహరించారు. జేఈవోగా ఉన్నా.. ఈవోగా ఉన్నా ఆయనదే పెత్తనం. నిజానికి ఐఏఎస్ అధికారులకే ఆ బాధ్యతలు ఇవ్వాలి. కానీ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ధర్మారెడ్డినే టీటీడీలో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి , ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లగా వ్యవహరించారు. జంతువుల కొవ్వును వాడారాని.. ఆ నెయ్యి విషయంలో వచ్చిన ల్యాబ్ రిపోర్టు బయటకు వస్తే.. హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లుగా వైసీపీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?