Animal Fat used in Tirumala Laddu | తిరుమల: తిరుమలలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు, టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు ఘాటుగా స్పందించారు. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని, నెయ్యి, ప్రసాదాలలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు. అయితే నెయ్యి కల్తీపై టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం నాడు స్పందించారు. గతంలో నెయ్యి సరఫరాపై, నాణ్యతపై ఎలాంటి పరీక్షలు జరగలేదన్నారు. అయితే జూలై 6, 12 వ తేదీన నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్ కీ ల్యాబ్ కీ పంపగా.. జంతువుల కొవ్వు కలిసిందని, నాసిరకం నెయ్యి లడ్డూ, ఇతర ప్రసాదాలకు వినియోగించారని స్పష్టం చేశారు. త్వరలోనే టీటీడీలో పదార్థాల పరిశీలనకు అధునాతన ల్యాబ్ ని ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు.


నాసిరకం నెయ్యిని సరఫరా చేశారు..


టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ‘నెయ్యి లాంటి పదార్థాలు కల్తీ చేశారా లేదా అని టెస్టులు చేసేందుకు ఓ ల్యాబ్ కచ్చితంగా కావాలి. రూ.75 లక్షలు ఖర్చు అవుతుంది. మన సొంత ల్యాబ్ ఉంటే నెయ్యి కల్తీ జరగకపోయేది. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి క్వాలిటీ బాగాలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది. సరఫరాదారులకు ఇదివరకే మేం వార్నింగ్ ఇచ్చాం. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ మార్చి 12, 2024న టెండర్ కు పిలిచాం. మే నెలలో ఫైనల్ చేశారు. రూ.319కి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చేయరని నిపుణులు చెప్పారు. అంటే తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని సప్లై చేశారు. 


ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ వాల్యు టెస్టులు ఒకటి. 39 రకాల టెస్టులు చేయడం మరో పరీక్షలు జరపాలి. ఎస్ వాల్యు టెస్టులో 5 రకాల టెస్టులు.. ఓవరాల్ క్వాలిటి ఎలా ఉందనేది పరీక్షిస్తారు. 98.6 నుంచి 104గా ఫ్యాట్ ఉండాలి. కానీ పరీక్షల్లో 20.3 వచ్చిందంటే ఎంత కల్తీ జరిగిందో అర్థమవుతుంది.


4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి గుర్తించాం..


తీవ్రమైన ఆరోపణలు రావడంతో.. ఇక్కడ నాణ్యమైన ల్యాబ్ లేని కారణంగా.. తొలిసారి టీటీడీలో కాకుండా బయట ల్యాబ్ కు శాంపిల్స్ పంపించి పరీక్షలు చేయించాం. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి, వెనక్కి పంపించాం. గుజరాత్ లోని ఆనంద్ దగ్గర ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేపించాం. వాస్తవానికి ఇక్కడ విదేశాలకు పంపించే పదార్థాలను పరీక్షిస్తుంటారు. అయితే నాణ్యత లేదని పరీక్షల్లో తేలిన తరువాత సరఫరాదారులను హెచ్చరించగా.. నెయ్యి నాణ్యత పెంచారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డూ నాణ్యత పెంచాలని సీఎం నన్ను ఆదేశించారు’ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. 


Also Read: Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే