పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు, ఆయన సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘన విజయం తర్వాత, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టారు. మళ్లీ సినిమాలవైపు ఎప్పుడు అడుగులు వేస్తారు? అని చూస్తున్న వాళ్లకు 'హరిహర వీరమల్లు' టీమ్ ఓ క్రేజీ న్యూస్ చెప్పింది.


సెప్టెంబర్ 23వ తేదీ నుంచి మళ్లీ షురూ!
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu Movie) ఒకటి. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్... మరోవైపు వీలు చూసుకొని షూటింగ్ కోసం టైమ్ ఇస్తానని చెప్పారు. దాంతో 'హరిహర వీరమల్లు' టీమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. 


విజయవాడలో 'హరిహర వీరమల్లు' కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చిత్రీకరణ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ (సోమవారం) నుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. 


హాలీవుడ్ యాక్షన్ దర్శకుడితో పవన్ మీద ఫైట్!
హాలీవుడ్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ (Nick Powell) ఆధ్వర్యంలో 'హరి హర వీరమల్లు' కోసం విజయవాడలో వేసిన సెట్స్‌లో భారీ యుద్ధ సన్నివేశం ఒకటి తీస్తున్నామని నిర్మాతలు తెలిపారు. హాలీవుడ్ మూవీస్ 'బ్రేవ్‌ హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి సినిమాలకు నిక్ పని చేశారు.


Also Read: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్... అతిథులుగా ఎన్టీఆర్‌తో సినిమాలు చేసిన, చేయబోయే దర్శకులు



'హరి హర వీర మల్లు' యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో షూటింగ్ చేయనున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని చిత్ర బృందం తెలిపింది. నాజర్, రఘుబాబు, సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప తదితరులు సైతం జాయిన్ కానున్నారు. ఈ విజయవాడ షెడ్యూల్‌తో చిత్రీకరణ తుదిదశకు చేరుకోనుంది.


పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి పని చేస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు