Breaking News Live Telugu Updates: క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Aug 2022 07:56 PM
క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు 

క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ స్టేట్ మెంట్, వాట్సాప్ చాట్ ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి విచారణకు హాజరవ్వాలని ఈడీ కోరింది. 

పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థులను చితకబాదిన టీచర్

Nizamabad News : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణ రహితంగా చితకబాదాడు ఉపాధ్యాయుడు. మాస్టారు కొట్టిన దెబ్బలతో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Dasoju Sravan: కాంగ్రెస్‌కు మరో షాక్, దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవలే పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇక టికెట్ తనకు దక్కదనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ ను వీడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

East Godavari: కరెన్సీనోట్ల అలంకరణలో అమ్మవారి ఆలయం, కడియపులంకలో 11.50 లక్షల నోట్లతో

శ్రావణ శుక్రవారం అనగానే లక్ష్మీదేవి పూజ ప్రత్యేకం.. వరలక్ష్మీ వ్రతాలను ఆచరించిన భక్తులు కోరిన కోర్కెల కోసం ప్రత్యేక పూజల్లో నిమగ్నమవుతారు.. వివాహిత స్త్రీలు కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం, సంతానం కోసం ప్రార్ధిస్థారు.. అదేవిధంగా పవిత్ర శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి చేసిన పూజలు అష్ట దేవితలను పూజించడం అవుతుందని ప్రగాఢ నమ్మకం.. ఈనేపథ్యంలోనే గ్రామాల్లోనూ గ్రామ దేవతలకు పూజలు చేసి వ్రతాలచరిస్తారు.. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో వేంచేసియున్న ముసలమ్మ అమ్మవారి ఆలయ గర్భగుడిలో అక్కడి భక్తులు కరెన్సీ నోట్లుతో అలంకరించి తమ ప్రత్యేకతను చాటుకుని భక్తి పారవశ్యంతో మురిసిపోయారు. లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ కొత్తనోట్లతో అలంకరించడంతోపాటు ఆలయం నిండా కరెన్సీ నోట్లుతో నింపి రంగ రంగుల పూలతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం దాదాపు రూ.11లక్షల 50 వేల ను వినియోగించారు. 2000 నోట్లు నుంచి వంద రూపాయల నోట్లు వరకు అందంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ విస్తృత ఏర్పాట్లు నిర్వహించగా అమ్మవారిని, నోట్లు రూపంలో ఉన్న ఈ లక్ష్మీదేవి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు వరుస కడుతున్నారు.

Fire Accident Near AP CM Camp Office: ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో అగ్నిప్రమాదం

తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పోలీసు ఔట్ పోస్ట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టెంట్ లోపలి సామాను దగ్దమైంది.
పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో తీవ్ర భయాందోళనలో‌ స్థానికులు
ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పింది. 
పోలీసు సిబ్బంది లోపల లేకపోవడంతో ముప్పు తప్పింది ..

Telangana Congress: కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన‌మైంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి స‌మ‌క్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇంటిపార్టీని విలీనం చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య‌, సందీప్ చ‌మార్, కాంగ్రెస్ నాయ‌కుడు స‌త్తు మ‌ల్లేష్ పాల్గొన్నారు.

Palnadu District: కోనూరులో హోటల్, కిరాణా దుకాణం తగులబెట్టిన దుండగులు

  • పల్నాడు జిల్లా పెదకూరపాడు: అచ్చంపేట మండలం కోనూరులో హోటల్, కిరాణా దుకాణం తగులబెట్టిన దుండగులు

  • కొన్ని రోజులుగా కోనూరు లంకభూముల సొసైటీ అధ్యక్ష విషయంలో వివాదం

  • సొసైటీ అధ్యక్షుడిగా పోటీ పడిన వేమవరపు అశోక్

  • తెల్లవారు జామున అశోక్ చెందిన హోటల్, కిరాణా దుకాణం తగలబెట్టిన దుండగులు

  • పీయస్ లో ఫిర్యాదు చేసిన అశోక్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Revanth Reddy Komatireddy Brothers: రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు  ముగిశాక మునుగోడుకు వెళ్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి రెడ్డి చాలా తప్పు చేశారని, తనను ఓడించాలనుకున్న చెరుకు సుధాకర్ ను  పార్టీలో ఎలా చేర్చుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

TRS News: విపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు - కేసీఆర్ నిర్ణయం

భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్ అల్వా కు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు.

Bandi Sanjay Delhi Tour: నేడు ఢిల్లీకి బండి‌ సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు విరామం వచ్చింది. నేడు ఆయన సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడంతో పాటు అమిత్ షా, జేపీ నడ్డాను కలుస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌ను ఢిల్లీలో పార్టీలోకి చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా మునుగోడులో కండువా కప్పాలా అనే దానిపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

Road Accident In Suryapet: మాధవరం వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా మాధవరం వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు 
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడ్డవారిని సూర్యాపేట ఏరియా అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Siddipet Accident: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యానును తీసుకెళ్తున్న క్రేన్ ను ఆర్టీసీ మినీ బస్సు ఢీకొని బోల్తాపడింది. బస్సులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మినీ బస్సు హుస్నాబాద్ నుంచి రామవరం మీదుగా సికింద్రాబాద్ వెళుతోంది. అయితే బస్సులో ప్రయాణీకులు ఎక్కువమంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెన్నా నదితో ప్రవహిస్తున్న నీటిని చూడడానికి కాలువాపల్లి బ్రిడ్జి పైకి గ్రామస్తులు వెళ్లారు. దీంతో అతి వేగంతో దూసుకువచ్చిన లారీ వారిని ఢీకొంది. గ్రామస్థులు గమనించి ఆ లారీని వెంబడించి పట్టుకున్నారు. అయితే, నుజ్జు నుజ్జుగా మాంసపు ముద్దలా ఇద్దరి మహిళలు క్షణాల్లో మారిపోవడం అక్కడున్నవారిని కలచివేసింది. బెళుగుప్ప మండలం కాలువపల్లిలో నిన్న పేరూరు డ్యాం నుంచి నాలుగు గేట్లు గుండా నీరు వదలగా నీరు చూడడానికి బ్రిడ్జిపై సరస్వతి, లక్ష్మీదేవి, అనే మహిళలు నిలబడ్డారు. ఆ వంతెనపై నుంచి దూసుకెళ్లిన లారీ ఆ ఇద్దరిని ఢీకొనగా వారు అక్కక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతం నుంచి ఏపీ తీరం వైపు బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో నేడు ఏపీలోని కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు కొనసాగుతోంది.


రెండు రోజుల్లో అల్పపీడనం..
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడనుంది. తెలంగాణలోనూ మరో నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 


తెలంగాణలో భారీ వర్షాలు  (Rains in Telangana) 
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 


మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. ప్రస్తుత సమాచారం మేరకు రాష్ట్రంలో ఆగస్టు 8 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల నేటి నుంచి మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్ష సూచనలతో ఈ ప్రాంతాలకు ఆగస్టు 7 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.