Ram Charan's Game Changer Review In Telugu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు. కమల్ హాసన్, శంకర్ కలయికలో 'ఇండియన్ 2' చేయాలనుకున్నారు దిల్ రాజు. అయితే, దాని బదులు 'గేమ్ చేంజర్' కుదిరింది. 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? శంకర్ ఎలా తీశారు? సినిమాలో కథ, కథనాలు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
కథ (Game Changer Movie Story): రామ్ నందన్ (రామ్ చరణ్) ఐఏఎస్ అధికారి. విశాఖకు కలెక్టరుగా వస్తారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే అవినీతిపరులు, అక్రమార్కుల భరతం పడతాడు. రేషన్ బియ్యం - ఇసుక మాఫియాకు బుద్ధి చెప్పి మిగతా వాళ్లను దారిలో పెడతాడు. ఆ మాఫియా వెనుక ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కుమారుడు బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య) ఉంటాడు.
ఇసుక మాఫియా విషయంలో రామ్ నందన్, బొబ్బిలి మోపిదేవి మధ్య జరిగిన గొడవ - తదనంతర పరిణామాల వల్ల ఎన్నికల వరకు వెళ్లాల్సి వస్తుంది. రామ్ నందన్ పోలికలతో ఉన్న అప్పన్న (రామ్ చరణ్) ఎవరు? ఆయన మరణానికి కారకులు ఎవరు? అప్పన్న భార్య పార్వతి (అంజలి)ని చూసి ఏకంగా ముఖ్యమంత్రి ఎందుకు షాక్ అయ్యాడు? ఎన్నికల్లో ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Game Changer Review Telugu): 'ఇండియన్ 2' తర్వాత శంకర్ రచన, దర్శకత్వంలో పస తగ్గిందని కామెంట్స్ వినిపించాయి. ఆయనలో మిడాస్ టచ్ మిస్ అయ్యిందని విమర్శలు వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో సందేశాత్మక కథలతో కమర్షియల్ సినిమా తీయడం తన స్పెషాలిటీ ఏమిటో 'గేమ్ చేంజర్'తో మరోసారి చూపించారు శంకర్. రామ్ చరణ్ లాంటి యాక్టింగ్ పవర్ హౌస్ ఉండటంతో ఆయన మార్క్ కొన్ని సన్నివేశాల్లో మరింత ఎలివేట్ అయ్యింది. పెన్ పవర్ కొంత తగ్గిన చోట యాక్టింగ్ పవర్ సినిమాను నిలబెట్టింది.
అవినీతిపరుడైన మంత్రి, సీఎం కావాలని కలలు కనే ముఖ్యమంత్రి తనయుడిని ఒక కలెక్టర్ ఎలా కంట్రోల్ చేశాడు? అనేది క్లుప్తంగా 'గేమ్ చేంజర్' కథ. యువ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథలో కమర్షియల్ సినిమాకు అవసరమైన హంగులు ఉన్నాయి. కానీ, కొత్తదనం లేదు. పొలిటికల్ డ్రామాలు, ఇంతకు ముందు శంకర్ తీసిన సినిమాలు చూసిన ప్రేక్షకులకు కథ కొత్తగా ఏమీ ఉండదు. కానీ, శంకర్ రేసీ స్క్రీన్ ప్లే ఆ లోటు తెలియనివ్వకుండా చేసింది. అలాగే కమర్షియల్ పంథాలో కథను పరుగులు పెట్టించారు. హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత హీరో - విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ తీయడంలో తన అనుభవం చూపించారు. అయితే... రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రేమలో పడే సన్నివేశాలను కొత్తగా రాసి, తీసి ఉంటే బావుండేది. రొటీన్ అనిపించాయి. క్లైమాక్స్ కూడా సినిమాకు కావాల్సిన హై ఇవ్వలేదు.
'గేమ్ చేంజర్'ను మెగా అభిమానిగా చూస్తే... మరీ ముఖ్యంగా జనసేన శ్రేణులకు నచ్చే అంశాలు ఉన్నాయి. బొబ్బిలి మోపిదేవి (సూర్య) క్యారెక్టర్ మీద వేసిన కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రతిపక్ష పార్టీ శ్రేణులు నొచ్చుకునేలా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'డబ్బు లేని రాజకీయాలు చేయాలి' అని అప్పన్న పాత్ర చెప్పే, ఆ సిద్ధాంతాలు జనసేనను గుర్తు చేయడం మాత్రమే కాదు, జనసేనకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.
'గేమ్ చేంజర్' సినిమాలోని ప్రతి ఫ్రేములోనూ 'దిల్' రాజు - శిరీష్ ప్రొడక్షన్ వేల్యూస్ ఆశ్చర్యపరుస్తాయి. ఖర్చుకు అసలు ఏమాత్రం వెనుకాడలేదు. ముఖ్యంగా పాటల్లో భారీతనం కనబడుతుంది. శంకర్ మార్క్ సీన్లకు తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా బావుంది. ప్రతి పాట పిక్చరైజేషన్‌లో రిచ్‌నెస్ కనిపించింది. కెమెరా వర్క్ బావుంది. హీరో ఎలివేషన్స్ విషయంలో కెమెరా వర్క్ సూపర్బ్. క్రిస్పీ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది.
రామ్ చరణ్ కెరీర్‌లో అప్పన్న క్యారెక్టర్ మరో మైలురాయిగా నిలుస్తుంది. నత్తి వల్ల ఇబ్బంది పడే సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. ఇక, రామ్ నందన్ పాత్రలో స్టైలిష్ లుక్స్ బావున్నాయి. రామ్ చరణ్ డ్యాన్స్ కూడా! అలవోకగా వేసిన కొన్ని స్టెప్స్ విజిల్స్ వేసేలా ఉన్నాయి. కియారా అద్వానీ అందంగా కనిపించారు. అయితే, నటన పరంగా అంజలి అదరగొట్టారు. తప్పెటగుళ్ళు కొట్టేటప్పుడు ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఆ లుక్స్ కొన్నాళ్ళు గుర్తుంటాయి. అంజలిని ఇంకొన్నాళ్లు నిలబెట్టే రోల్ ఇది.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
నటుడిగా ఎస్.జె. సూర్య సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అయితే, ఆయన నటన రొటీన్ అవుతుందని విమర్శలు ఉన్నాయి. కానీ, 'గేమ్ చేంజర్'లో కొత్త ఎస్.జె. సూర్య కనిపిస్తారు. లుక్స్ నుంచి నటన వరకు ప్రతి అంశంలో కొత్తదనం చూపించారు. శ్రీకాంత్ కూడా అంతే. రెండు లుక్కుల్లో ఆయన కనిపించారు. నటుడిగానూ ఆయన కొత్తగా కనిపించారు. జయరాం, సునీల్, వెన్నెల కిశోర్ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ, కుదరలేదు.
'గేమ్ చేంజర్'... పక్కా కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫిల్మ్. స్టార్ హీరో నుంచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆశించే అంశాలు అన్నీ ఉన్న సినిమా. కమర్షియల్ ఫార్మటులో తీసినప్పటికీ... శంకర్ మార్క్ సీన్స్, రామ్ చరణ్ నటన, తమన్ సంగీతం విజిల్స్ వేయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మామూలు షాక్ ఇవ్వలేదు. అదొక సర్‌ప్రైజ్ అయితే అప్పన్నగా రామ్ చరణ్ నటన సినిమాకు మరొక హైలైట్. పండక్కి హ్యాపీగా చూడొచ్చు. ఏపీ రాజకీయాలపై జనాల్లో అవగాహన ఉంటే సినిమాను ఎక్కువ రిలేట్ చేసుకుంటారు.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?