Vaikunta Ekadashi Celebrations In Tirumala Temple: వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ కైంకర్యాలు, అభిషేకాలు, సేవల అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే అధికారులు స్వామి దర్శనానికి అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయానికి ముందే దర్శనం కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు సహా సామాన్య భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అటు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో సుందరంగా అలంకరించారు.
విద్యుత్ దీపాలంకరణలతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఆలయం, వైకుంఠ ద్వారం సహా అంతరాలయం, ఆలయం వెలుపల ప్రత్యేక పుష్పాలతో చేసిన అలంకరణలు ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆలయం వెలుపల వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఏర్పాటు చేసిన వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అలంకరణ భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అటు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనిపించింది. భక్తులు ఉదయం నుంచే వెంకటేశుని దర్శనానికి బారులు తీరారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు, ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
వారికి ప్రత్యేక దర్శనం
అటు, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో అధికారులు శుక్రవారం ప్రత్యేక దర్శనం కల్పించారు. మొత్తం 52 మందికి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయించారు. కాగా, బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి, స్వల్ప గాయాలైన వారికి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు వీరికి భరోసా కల్పించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక దర్శనం చేయిస్తామని ప్రకటించి ఆ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు.
Also Read: