AP Sschools: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో తిరిగి పాత పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. జగన్(Jagan) తీసుకొచ్చిన విధానానికి స్వస్తి పలుకుతూ పాత విధానాన్నే అమలు చేయనుంది. ఈ మేరకు జీఓ నెంబర్ -117 రద్దు చేసి.. కొత్తగా తీసుకురానున్న నూతన విధానంపై పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు(Teachers), విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం జీవో విడుదల చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 4,731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులకు ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో(Schools) విలీనం చేశారు. ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకురానున్నారు. ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయనున్నారు. విద్యార్థుల(Students) సంఖ్యను బట్టి ఈ బడులను ఉన్నతీకరించడం లేదా ప్రాథమిక బడులుగా మార్చే అవకాశం ఉంది. అలాగే ఇంటర్‌తో కలిపి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్(High School Plus) వ్యవస్థను పూర్తిగా తీసివేయనున్నారు. ఇంటర్ బోర్డుకే ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, బడి దూరాన్ని ఐదు రకాలుగా పాఠశాలలను విభజించనున్నారు.
ఆదర్శ పాఠశాలలలు
రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు ఐదుగురు టీచర్లను నియమించనున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటితే...ప్రధానోపాధ్యాయుడు(Head Master) పోస్టు కేటాయించనున్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రతి 30 మందికి కలిపి ఒక టీచర్‌ను కేటాయించనున్నారు. మండల, క్లస్టర్ స్థాయిలో మండల విద్యాధికారి, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల కమిటీ కలిసి ఆదర్శ పాఠశాలలను గుర్తించనుంది.
ఒక పంచాయతీ పరిధిలో ఎక్కువ ప్రాథమిక పాఠశాలలు ఉంటే.. వీటికి మధ్యలో ఉండే బడిని పాఠశాల యాజమాన్య కమిటీని సంప్రదించి వారి సూచనల మేరకు ఆదర్శ పాఠశాలగా మార్పు చేయనున్నారు.. ఆయా బడుల్లో ఉన్న 3,4,5 తరగతుల విద్యార్థులను ఆదర్శ పాఠశాలకు తరలించనున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో కలిపి 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను ప్రాథమిక బడులుగా మార్చేయనున్నారు. వీటిల్లో ఉన్న 6, 7, 8 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయనున్నారు. 60 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే వాటిని ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించనున్నారు.
ఐదు పాఠశాలల రకాలు
1. ఎల్‌కేజీ, యూకేజీ బోధించే అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్పుచేయనున్నారు.
2. ఎల్‌కేజీ,యూకేజీతోపాటు 1,2 తరగతులు కలిపి బోధించే వాటిని ఫౌండేషన్ పాఠశాలలుగా పిలవనున్నారు.
3 . 1నుంచి 5 తరగతులు ఉండేవాటిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా పిలవనున్నారు.
4. ఎల్‌కేజీ, యూకేజీతోపాటు 1 నుంచి 5 తరగతులతో గ్రామపంచాయతీ, వార్డు, డివిజన్‌కో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
5. 6 నుంచి 10 తరగతులు ఉండే వాటిని ఉన్నత పాఠశాలలుగా కొనసాగనున్నాయి.
టీచర్ల కేటాయింపు
పౌండేషన్ పాఠశాలల్లో 30 మంది లోపు పిల్లలు ఉంచే ఒక టీచర్‌ను అంతకు మించితే ఇద్దరిని కేటాయించనున్నారు. బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మంది వరకు ఒక టీచర్, 20 నుంచి 60 వరకు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో 76 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయుడితోపాటు పీఈటీ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. తక్కువగా ఉంటే సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ప్రాధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్, ఆర్ట్స్, డ్రాయింగ్, క్రాప్ట్ టీచర్లను సైతం కేటాయించనున్నారు.