TGSRTC Additional Charges On Sankranti Special Buses: సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉందని.. ఆ మేరకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగకు 6,432 స్పెషల్ సర్వీసులు నడిపిస్తామని.. ఈ నెల 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. 'ప్రత్యేక బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. ఈ నెల 10, 11, 12, 19, 20 5 రోజుల పాటు అదనపు ఛార్జీలు ఉంటాయి.' అని ఓ ప్రకటనలో తెలిపారు.


యథావిధిగా ఫ్రీ బస్ సర్వీస్..


సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. అటు, సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్ నెంబర్లు 040 - 69440000, 040 - 23450033 ను సంప్రదించాలని సూచించింది. మరోవైపు, రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


ప్రత్యేక బస్సుల పూర్తి వివరాలు


సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుండగా.. 557 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకూ ఇవి అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు (AP) కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి నగరాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులు సంస్థ ఏర్పాటు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రచించింది.


ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ www.tgsrtcbus.in లో చేసుకోవాలని పేర్కొంది. అటు, ఏపీఎస్ఆర్టీసీ సైతం పండుగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 9 నుంచి 13 వరకూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.


Also Read: Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ