Nitish Reddy News: ఆస్ట్రేలియా టూర్లో హీరోగా నిలిచిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఈనెల 5న సిడ్నీ ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. అక్కడి నుంచి తమ తమ స్వస్థలాలకు క్రికెటర్లు చేరుకున్నారు. ఈ క్రమంలో నితీశ్ కుడా గురువారం విశాఖ పట్నానికి చేరుకోగా, అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నం ఏయిర్ పోర్టు బయట పెద్ద సంఖ్యలో నిలబడి నితీశ్ ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడంతా కోలాహలంగా మారింది. ఇక నితీశ్ ఏయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే, పెద్ద గజమాలతో అతడిని సత్కరించారు. అనంతరం అతనిపై పూలు జల్లుతో ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. నితీశ్ కు వెల్కం చెబుతూ ఆ వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
జీపులో ఊరేగింపు..
విమానశ్రయం నుంచి బయటకు రాగానే పెద్ద ఓపెన్ టాప్ జీప్ ముందు వరుసలో కూర్చుని నితీశ్ అభిమానులకు కనిపించాడు. తనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అలాగే తమ మొబైల్లో నితీశ్ ను బంధించేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. నితీశ్ పక్కనే ఆయన తండ్రి ముత్యాలు రెడ్డి కూడా ఉన్నాడు. విశాఖలోని గాజువాకకు చెందిన నితీశ్.. అనూహ్యంగా ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా టెస్టు జట్టులో డెబ్యూ చేశాడు. తొలి టెస్టులోనే అదరగొట్టిన నితీశ్, వరుసగా రాణిస్తూ సిరీస్ లోని ఐదు టెస్టులు ఆడాడు. 37 సగటుతో 298 పరుగులు చేసిన నితీశ్.. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పేస్ ఆల్ రౌండర్ అయిన నితీశ్ బౌలింగ్ లోనూ రాణించి ఐదు వికెట్లు తీశాడు. సీనియర్ ఆల్ రౌండర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు మిన్నగా తను రాణించాడు. మెల్ బోర్న్ టెస్టులో శతకం బాది అందరి మనసు దోచుకున్నాడు.
ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఆడతాడా..?
ఇక ఈనెల 22 నుంచి భారత్ తో ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు నితీశ్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పేస్ ఆల్ రౌండర్ కావడంతో నితీశ్ ను జట్టులో ఆడించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లలో అతడిని ఆడించాలని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది బంగ్లాదేశ్ పై టీ20ల్లో అరంగేట్రం చేసిన నితీశ్.. సత్తా చాటి, టెస్టు జట్టు వరకు ప్రమోషన్ పొందాడు. ఇక ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో తను బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ఇంగ్లాండ్ తో 5 టీ20ల అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా మూడు వన్డేల సిరీస్ కూడా అదే జట్టుతో జరుగనుంది. అనంతరం భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు గాను దుబాయ్ కి వచ్చేనెలలో బయల్దేరి వెళ్లనుంది. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ టోర్నీలో కేవలం భారత్ ఆడే మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ లో నిర్వహించనున్నారు. మిగతా అన్ని జట్ల మ్యాచ్ లు పాక్ లో జరుగుతాయి. 23న భారత్ తో మ్యాచ్ కోసం దుబాయ్ కి వచ్చి మరీ పాక్, భారత్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ నాకౌట్ మ్యాచ్ లైన సెమీస్, ఫైనల్స్ కి భారత్ చేరితే మ్యాచ్ లు దుబాయ్ లోనే జరుగనున్నాయి.