BCCI Vs Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల తొలివారంలో జరిగిన సిడ్నీ టెస్టులో తను గాయపడ్డాడు. ఆ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ కూడా వేయలేకపోయాడు. ప్రస్తుతం బుమ్రాకు అయిన గాయం గ్రేడ్ 1 అని తెలుస్తోంది. దీనికి రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సమాచారం. అయితే బుమ్రా గాయానికి చికిత్స అందించేందుకు బీసీసీఐ డేరింగ్ స్టెప్ తీసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డా. రోవాన్ షౌటెన్‌ను సంప్రదించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. వెన్నునొప్పికి సంబంధించి రోవాన్‌కు మంచి అనుభవమున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమై సెలెక్టర్లకు కూడా సూచన అందించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే డేట్ దగ్గర పడింది. ఈ టోర్నీలో బుమ్రా ఆడాలని బోర్డు కోరుకుంటోంది. అతను వేగంగా కోలుకునేందుకు పలు చర్యలు తీసుకుంటోంది.
ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే..
ఒకవేళ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటేనే అతడిని తుదిజట్టులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి చూచాయగా అతడి పేరును ఎంపిక చేసినప్పటికీ, గాయం నుంచి కోలుకుని వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టోర్నీకి అనుమతించాలని బోర్డు భావిస్తోంది. అలాగే అతను ఫిట్‌గా ఉంటే లిమిటెడ్ ఓవర్ల వైస్ కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని చూస్తోంది. ఇటీవల ఆసీస్ టూర్లో అతను కెప్టెన్సీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయక ఆటతీరుతో తొలి టెస్టులో 295 పరుగులతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించాడు. అలాగే ఐదో టెస్టులోనూ కెప్టెన్సీ వహించిన బుమ్రా.. జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. బుమ్రా సారథ్యంలోని రెండు టెస్టుల్లోనే భారత్ డామినేషన్ చూపించింది. రెండు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకోగా, మిగతా మూడు టెస్టుల్లో ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకునేందుకు ఆపసోపాలు పడింది.
కెప్టెన్సీ వద్దు..
అయితే కెప్టెన్సీలో అద్భుతాలు చేసిన బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించకూడదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయ పడుతున్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలరని, అతడిని కేవలం బౌలింగ్‌కు మాత్రమే పరిమితం చేద్దామని వాదిస్తున్నాడు. కెప్టెన్సీ అంటే అనేక రకాల ఒత్తిడి ఉంటుందని, ఈ క్రమంలో గాయాల బారిన పడి బుమ్రా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముందని పేర్కొన్నాడు.నిజానికి బుమ్రా రనప్ చాలా చిన్నగా ఉంటుందని, ఐదారు అడుగులు పరుగెత్తుకుంటూ వచ్చి, ఒకేసారి పేస్‌తో బౌలింగ్ చేస్తాడని, ఈ రకమైన శైలితో గాయాల బారిన పడే అవకాశముందని కైఫ్ పేర్కొన్నాడు.
ఇక దానికి తోడు కెప్టెన్సీ కూడా బుమ్రాకు అప్పగిస్తే వ్యూహాల ఒత్తిడిలో పడి అతను గాయాల బారిన పడే అవకాశముందని, బీసీసీఐ అలాంటి పొరపాటు చేయకూడదని వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్లో ఇంగ్లాండ్ టూర్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతారని, మధ్యలోనే బుమ్రా గాయపడిలే ఎలా అని అందుకే ఇప్పటి నుంచే వేరే ప్లేయర్లని కెప్టెన్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఐపీఎల్‌లో సారథ్య అనుభవం ఉందని గుర్తు చేశాడు. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ జట్టుకు టెస్టులో నాయకత్వం వహించాడని తను కూడా సరిపోతాడని పేర్కొన్నాడు. సిసలైన పేసర్ బుమ్రాను.. కెప్టెన్సీ పేరుతో అనవసరంగా టీమ్ మేనేజ్మంట్ ప్రయోగాలు చేయకూడదని, తనను బౌలింగ్‌పైనే కాన్సట్రేషన్ చేసేలా చూడాలని పేర్కొన్నాడు. ఏదేమైనా దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.