Guptill Retirement News: ఈ ఏడాది తొలివారమే క్రికెట్ ప్రేమికులకు పెద్ద షాక్ తగిలింది. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. 38 ఏళ్ల గప్టిల్ 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పదిహేనేళ్ల కెరీర్లో తను ఓపెనర్‌గా ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ తరపున ఏకైక డబుల్ సెంచరీని గప్టిలే నమోదు చేయడం విశేషం. 2015 వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై నమోదు చేసిన 237 పరుగుల ఇన్నింగ్స్ కివీస్ తరఫున అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. అలాగే కివీస్ తరఫున నమోదైన నాలుగు అత్యధిక వన్డే స్కోర్లలో మూడు గప్టిలే చేయడం విశేషం. ఇక భారత అభిమానులు గప్టిల్‌ను ఏమాత్రం మరిచిపోలేరు అనడంలో సందేహం లేదు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని రనౌట్ చేసి, మన జట్టు ఓటమిలో తను ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్‌తో ఎంతోమంది అభిమానులు కంటతడి పెట్టారు. పెవిలియన్‌కు వెళ్తూ ధోని సైతం చెమర్చిన కళ్లతో కనిపించాడు. ధోనీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అదే కావడం విశేషం. అలాంటి క్రికెటర్ బుధవారం ఆటకు వీడ్కోలు పలికాడు.
23 సెంచరీలు..
నిజానికి న్యూజిలాండ్ తరపున నాణ్యమైన బ్యాటర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అక్కడి పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో అంతగా విధ్వంసకర బ్యాటర్లు ఉనికి రాలేదు. బ్రెండన్ మెకల్లమ్, నాథన్ అస్టిల్, క్రెయిగ్ మెక్మిలన్ లాంటి కొంతమంది డేంజరస్ ప్లేయర్లు మన యాదిలోకి వస్తారు. అయితే గప్టిల్ కూడా వాళ్ల కోవలోకే వస్తాడు. ఓపెనర్‌గా తను ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఒంటిచేత్తో విజయాలను అందించాడు. 15 ఏళ్ల తన కెరీర్లో 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టులను ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 23 సెంచరీలను ఈ విధ్వంసకర ప్లేయర్ బాదాడు. నిజానికి 2022 నుంచే జాతీయ జట్టు తరపున గప్టిల్ కనిపించడం లేదు. తను ఆ ఏడాదే చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక టీ20ల్లో కివీస్ తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గప్టిలే కావడం విశేషం. అతను 3531 పరుగులతో కివీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మూడో ప్లేయర్..
ఇక వన్డేల్లోనూ గప్టిల్ జోరు చూపించాడు. కివీస్ తరఫున అత్యధిక వన్డే రన్స్ చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. తన ఖాతాలో 7,346 పరుగులు ఉన్నాయి. వన్డేలంటే మరో విషయం అభిమానులకు గుర్తుకువస్తుంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ టై కాగా, సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఆ సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఆ ఓవర్లో రన్ కోసం ప్రయత్నించి గప్టిల్ రనౌటవడంతో ఇంగ్లాండ్ ఖాతాలో వన్డే ప్రపంచకప్ తొలిసారి చేరింది. అలా ఆ సందర్బాన్ని చాలా మంది గుర్తుకు ఉంచుకుంటారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఆ మ్యాచ్ ప్రేక్షకుల మది నుంచి అంత త్వరగా చెరిగిపోదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రిటైర్మెంట్ సందర్భంగా గప్టిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇంతకాలం తనకు తోడుగా నిలిచిన భార్య పిల్లలు, మేనేజర్, కివీస్ బోర్డు, అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20లీగ్ లకు తను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. తను గతంలో ఐపీల్లోనూ ఆడాడు.