Kaif Comments: ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంతగా రాణించాడో వర్ణించడానికి మాటలు రాలేదు. మిగతా పేసర్లంతా కలిపి 35 వికెట్లు తీస్తే, బుమ్రా ఒక్కడే ఒంటిచేత్తో 32 వికెట్లు తీశాడు. ఆసీస్‌ను ఈ కాలంలో అంతగా వణికించిన మరో బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా గాయంతో బరిలోకి దిగడం లేదని తెలిసి, ఆసీస్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ తమ సొంతమైనట్లేనని గంతులు వేశారు. మ్యాచ్ ముగిశాక ఈ విషయాన్ని హెడ్, ఖవాజా లాంటి ప్లేయర్లు బహిరంగంగానే అంగీకరించారు. అయితే అంతటి పేరున్న బుమ్రాపై అనవసర బరువు పెట్టవద్దంటున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. బంగారు బాతులాంటి బుమ్రాను కాపాడుకోవాలని సూచించాడు. అప్పుడే తన మరింత కాలం ఎఫెక్టివ్‌గా సేవలు అందిస్తాడని పేర్కొంటున్నాడు.
కెప్టెన్సీ అస్సలు వద్దు..
ఈ మధ్య కాలంలో భారత టెస్టు కెప్టెన్సీ మార్పుపై జోరుగా చర్చలు సాగాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అంతంతమాత్రంగా రాణిస్తుండటంతో అతడిని కెప్టెన్సీతో పాటు జట్టు నుంచే సాగనంపాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అలాగే బుమ్రాకు కెప్టెన్సీ అందించాలని వాదనలు మొదలయ్యాయి. ఇక న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై క్లీన్ స్వీప్‌తో టెస్టు సిరీస్‌ను ఓడి ఘోర పరాభవం పాలైన భారత్‌ను ఆసీస్ టూర్ తొలి టెస్టులో గొప్పగా తన కెప్టెన్సీతో బుమ్రా నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరగులను కాపాడుకుని, ఏకంగా 295 పరుగులతో ఆతిథ్య జట్టుును కంగు తినిపించాడు. స్ఫూర్తిదాయక తన కెప్టెన్సీని చూసి అందరూ ఆహో ఓహో అన్నారు. అలాగే అదే సిరీస్ ఐదో టెస్టులోనూ బుమ్రా కెప్టెన్సీ వహించాడు. అయితే గాయం కారణంగా మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. తాజాగా కైఫ్ దీని గురించి మాట్లాడాడు. బుమ్రా అద్భుతమైన బౌలరని, అతడిని కేవలం బౌలింగ్‌కు మాత్రమే పరిమితం చేద్దామని వాదిస్తున్నాడు. కెప్టెన్సీ అంటే అనేక రకాల ఒత్తిడి ఉంటుందని, ఈ క్రమంలో గాయాల బారిన పడి బుమ్రా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముందని పేర్కొన్నాడు.
బుమ్రా రనప్ విచిత్రం..
నిజానికి బుమ్రా రనప్ చాలా చిన్నగా ఉంటుందని, ఐదారు అడుగులు పరుగెత్తుకుంటూ వచ్చి, ఒకేసారి పేస్‌తో బౌలింగ్ చేస్తాడని, ఈ రకమైన శైలితో గాయాల బారిన పడే అవకాశముందని కైఫ్ పేర్కొన్నాడు. ఇక దానికి తోడు కెప్టెన్సీ కూడా బుమ్రాకు అప్పగిస్తే వ్యూహాల ఒత్తిడిలో పడి అతను గాయాల బారిన పడే అవకాశముందని, బీసీసీఐ అలాంటి పొరపాటు చేయకూడదని వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్లో ఇంగ్లాండ్ టూర్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతారని, మధ్యలోనే బుమ్రా గాయపడిలే ఎలా అని అందుకే ఇప్పటి నుంచే వేరే ప్లేయర్లని కెప్టెన్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఐపీఎల్‌లో సారథ్య అనుభవం ఉందని గుర్తు చేశాడు. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ జట్టుకు టెస్టులో నాయకత్వం వహించాడని తను కూడా సరిపోతాడని పేర్కొన్నాడు. సిసలైన పేసర్ బుమ్రాను.. కెప్టెన్సీ పేరుతో అనవసరంగా టీమ్ మేనేజ్మంట్ ప్రయోగాలు చేయకూడదని, తనను బౌలింగ్‌పైనే కాన్సట్రేషన్ చేసేలా చూడాలని పేర్కొన్నాడు. ఇక మరో టెస్టు ఆడటానికి ఇండియాకు ఆరు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఆలోగా భారత సెలెక్షన్ కమిటీ దీనికి ఓ దారి కనుక్కుంటుందని అందరూ ఆశాభావంగా ఉన్నారు.
Also Read: BGT Update: ఆ లోపాలే బీజీటీలో భారత్ కొంపముంచాయా..? మేనేజ్మెంట్ మిస్టేక్స్ తో పదేళ్ల తర్వాత ఆసీస్ ఒడిలోకి ట్రోఫీ..!