Shami Injury Updates: కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు గుడ్ న్యూస్. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో అతను బెంగాల్ తరపున పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీ.. ఈ మ్యాచ్ లో పది ఓవర్లు వేయడంతోపాటు మూడు కీలక వికెట్లు తీసి తను ఐసీసీ టోర్నీ రేసులో ఉన్నానని చాటాడు. గురువారం హర్యానాతో ప్రి క్వార్టర్స్ మ్యాచ్ లో భాగంగా బెంగాల్ తరపున షమీ అదరగొట్టాడు. పూర్తి కోటా బౌలింగ్ చేసి తాను మెగాటోర్నీలో ఆడేందుకు సిద్ధమని సెలెక్షన్ కమిటీకి సంకేతాలు పంపాడు.
వన్డే ప్రపంచకప్ నుంచి జట్టుకు దూరం..
చివరగా జాతీయ జట్టు తరపున షమీ.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో చాలాకాలం ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని, దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో తొమ్మిది మ్యాచ్ లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీకి ఎంపకవుతాడని ఆశలు రేకెత్తించినా, మోకాల్లో వాపు రావడంతో తనను పక్కన పెట్టారు. మళ్లీ తన ఫిట్నెస్ పై కఠోర శ్రమ చేసిన షమీ.. తాజాగా దేశవాళీల్లో ఆడుతూ పునరాగమనం కోసం చాలా కష్టపడుతున్నాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఇప్పటికీ మూడు మ్యాచ్ లు ఆడాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో కేవలం ఎనిమిది ఓవర్లే బౌలింగ్ చేసిన షమీ.. ఈ మ్యాచ్ లో పది ఓవర్ల కోటా పూర్తి చేసుకున్నాడు. కొంచెం పరుగులిచ్చినా, కీలకమైన మూడు వికెట్లు తీసి తను జెన్యూన్ వికెట్ టేకర్ అని నిరూపించుకున్నాడు.
షమీ లేని లోటు..
ఇటీవల ఎక్స్ పీరియన్స్డ్ బౌలర్ లేని లోటును భారత్ బాగా ఫేస్ చేసింది. ముఖ్యంగా బీజీటీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మరో పేసర్ సహకారం అందించలేదు. అదే అనుభవం కలిగిన షమీ ఉన్నట్లయితే కథ మరోలా ఉండేదని చాలామంది మాజీలు, విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఏదేమైనా ఐసీసీ కీలక టోర్నీకి ముందు తను ఫామ్లోకి రావడం, అలాగే పూర్తి ఫిట్ నెస్ నిరూపించుకోవడం శుభపరిణామమని చెప్పవచ్చు. ఇక బీజీటీలో గాయపడిన బుమ్రా కోలుకోకపోతే పేస్ బౌలింగ్ భారాన్ని షమీనే మోసే అవకాశం ఉంటుంది. ఇక ఈ టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈనెల 12 నాటికి జట్టును ప్రకటించాలని ఐసీసీ డెడ్ లైన్ నిర్ణయించింది. అయితే వచ్చేనెల 13 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. వచ్చేనెల 19 నుంచి ఈ టోర్నీ పాకిస్థాన్ లో జరుగుతుంది. తన తొలి మ్యాచ్ ను దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్.. వచ్చేనెల 20న ఆడుతుంది.
Also Read: Dhanashree verma: నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దు - ట్రోల్స్‌పై భారత క్రికెటర్ భార్య ఫైర్