KL Rahul News: భారత వన్డే వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి ఐదు టీ20ల సిరీస్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ను కూడా ఇండియా ఆడనుంది. వచ్చేనెలలో పాకిస్థాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సిరీస్ లకు రాహుల్ కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే చాంపియన్స్ ట్రోఫీకి జట్టులోకి తీసుకుంటామనే హామీతోనే రాహుల్ కు ఇప్పుడు విశ్రాంతిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంలో వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ విశేషంగా రాణిస్తున్నాడు. అద్భుతమైన కీపింగ్ తోపాటు మిడిలార్డర్లో బాగా ఆడుతున్నాడు. 


టెస్టుల్లో రాణించిన రాహుల్..
ఇటీవల ఆసీస్ టూర్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో రాహుల్ ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి మోస్తరు పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో మాత్రం వికెట్ కీపర్ గా ఫస్ట చాయిస్ తో తను బరిలోకి దిగుతాడు. దీంతో చాంపియన్స్ ట్రోఫీకి తను ఎంపిక కావడం ఖాయమే. అయితే మెగాటోర్నీకి ముందు తగినంత విశ్రాంతినివ్వాలని బోర్డు భావించడంతో ఈ సిరీస్ కు అతడిని పక్కన పెట్టనున్నారు. అతని స్థానంలో రిషభ్ పంత్ ఆడే అవకాశాలున్నాయి. ఇక టీ20ల్లో సంజూ శాంసన్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. మరోవైపు కోచ్ గౌతం గంభీర్ సూచనతో భారత క్రికెటర్లు కొంతమంది డొమెస్టిక్ బాట పట్టారు. చాలామంది తమ సొంత జట్టు తరపున వీలైతే విజయ్ హజారే ట్రోఫీ, లేకపోతే రంజీ ట్రోఫీల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. 


ఆంధ్ర తరపున నితీశ్..
ఆసీస్ టూర్లో సెంచరీతో అదరగొట్టిన నితీశ్.. దేశవాళీల్లో బరిలోకి దిగనున్నాడు. ఆంధ్ర తరపున బరిలోకి దిగే నితీశ్, రంజీల్లో ఆడనున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెల 23న పుదుచ్చేరి, 30న రాజస్థాన్ తో రంజీ లీగ్ మ్యాచ్ లు ఆడనున్నాడు. ఆసీస్ టూర్ కి ముందు కేవలం ఒక్క రంజీ మ్యాచే ఆడిన నితీశ్.. ఇప్పుడు మరో రెండు మ్యాచ్ ల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఇక మిగతా భారత ఆటగాళ్లలో కర్ణాటక తరపున ప్రసిధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, తమిళనాడుకు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. ఆసీస్ పర్యటనలో ఘోర పరాజయాలు ఎదురైన క్రమంలో దేశవాళీల్లో ఆడాలని కోచ్ గంభీర్ హుకుం జారీ చేయడంతో భారత క్రికెటర్లు ఆ మేరకు బరిలోకి దిగనున్నారు. బరోడాతో శనివారం తలపడబోయే కర్ణాటక జట్టులో ప్రసిధ్, పడిక్కల్ బరిలోకి దిగనున్నారు. ఇక తమిళనాడు జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తేనే సుందర్ ఆ జట్టు తరపున ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది. 

Also Read: Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీపై గురి పెట్టిన స్టార్ పేసర్.. దేశవాళీల్లో అదరగొడుతున్న వెటరన్ బౌలర్