Mother And Father In Laws Killed Daughter In Law In Shamshabad: తెలంగాణలో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ వివాహితను 2 నెలల క్రితం చంపేసి భూమిలో పాతిపెట్టారు. తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) శంషాబాద్ మండల పరిధిలో ఈ దారుణం జరిగింది. తమకు ఇష్టం లేకుండా కుమారుడిని ప్రేమ వివాహం చేసుకుందని కోడల్ని అత్తమామలు చంపి పాతేశారు. శంషాబాద్ మండలం రామాంజపూర్ తండాకు చెందిన దూలి, అదే తండాకు చెందిన సురేష్‌ను 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అత్తమామలు తులసి - అనంతి దంపతులు ఆమెపై పగ పెంచుకున్నారు.


కల్లు తాగించి..


సురేష్ మద్యానికి బానిస కాగా దంపతుల మధ్య గొడవలు జరగ్గా.. ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సద్దిచెప్పారు. ఇదే అదునుగా భావించిన అత్తమామలు గతేడాది నవంబరులో కోడలిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎలుకల మందు కలిపిన కల్లు తాగించి తలపై బండరాళ్లతో మోది హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఇంటికెళ్లారు. భార్య అదృశ్యంపై భర్త ఫిర్యాదు చేయగా.. నవంబర్ 14న కేసు నమోదైంది. పోలీస్ విచారణలో అత్తమామలే నిందితులని పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని గురువారం వెలికితీశారు.


క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య


అటు, జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ కాళ్లు, చేతులు కట్టేసి ఫ్యాన్‌కు ఉరేశారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తాడు సాయంతో గది లోపలి నుంచి గడియపెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధి అయోద్యనగర్‌లో ఈ దారుణం గురువారం వెలుగుచూసింది. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం గోటూరుకు చెందిన లింగాల శివకుమార్ రెడ్డి (26) ఉపాధి కోసం నాలుగేళ్ల కిందట నగరానికి వచ్చి షాపూర్‌నగర్‌లో ఉంటున్నారు. గోటూరుకు చెందిన ప్రసాద్‌రెడ్డి కూడా అయోధ్యనగర్‌లోనే ఉంటున్నారు. ఆ గదికి శివకుమార్‌రెడ్డి 4 నెలల కిందటే మారారు. ఇతను క్యాబ్ నడిపేవాడు. ప్రసాద్‌రెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ఇంజినీరింగ్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి విధులకు హాజరై ఉదయం వచ్చి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తీయాలని ఎంత పిలిచినా శివకుమార్‌రెడ్డి నుంచి స్పందన లేదు.


ఆత్మహత్యగా చిత్రీకరించారు..


దీంతో ఇంటి యజమానికి చెప్పగా.. వారు స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శివకుమార్ రెడ్డి మృతిపై ఎవరకీ ఎలాంటి అనుమానం రాకుండా తలుపు లోపలి వైపు గడియ దగ్గర ఓ తాడు కట్టారు. ఆ తాడును కిటికీ వద్దకు లాగారు. దీంతో లోపలి నుంచి గడియపడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. 


మృతులు ఆ రోజు రాత్రి 1:30 గంటల వరకూ ఓ స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని.. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Also Read: Telangana News: తెలంగాణలో బీర్‌ ధరలో పన్నులే 70 శాతం- ప్రభుత్వ విమర్శలపై యూబీఎల్ రియాక్షన్