Breaking News Live Telugu Updates: రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి

ABP Desam Last Updated: 29 Jul 2022 06:56 PM
రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ 

బెంగాల్ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రపతికి లేఖ రాసిన ఆయన తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు తెలిపారు. 

విజయవాడ హ్యుండాయ్ కార్ల సర్వీస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం 

విజయవాడ బందర్ రోడ్డు హ్యుండాయ్ కార్ల సర్వీస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సర్వీస్ సెంటర్ నుంచి ఉద్యోగులు పరుగులు పెట్టారు. ప్రమాదం సమయంలో సర్వీస్ సెంటర్ లోపల సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. 

అఫ్గానిస్తాన్ క్రికెట్ స్టేడియంలో బాంబ్ పేలుడు 

అఫ్గానిస్తాన్ లోని క్రికెట్ స్టేడియంలో బాంబ్ పేలుడు జరిగింది. అఫ్గానిస్తాన్ ప్రీమియర్ టీ20 టోర్నీ సందర్భంగా కాబూల్‌లో జరుగుతున్న ఐపీఎల్ స్టైల్ టోర్నమెంట్‌లో ఆత్మాహుతి పేలుడు జరిగింది. దీంతో క్రికెటర్లు బంకర్ లోపలికి పరిగెత్తినట్లు తెలుస్తోంది. బ్యాండ్-ఇ-అమీర్ డ్రాగన్స్ vs పామిర్ జల్మీ మధ్య మ్యాచ్ సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. స్టేడియం లోపల దాడి జరిగినప్పుడు UN వ్యక్తి ఇంటర్వ్యూ కోసం అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. 

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్ శుభారంభం - సౌతాఫ్రికాపై విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీం విజయం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్ తొలిరోజే శుభారంభం చేసింది. ఇండియన్ విమెన్స్ టేబుల్ టెన్నిస్‌ టీమ్ సౌతాఫ్రికాపై 3-0 తేడాతో విజయం సాధించింది. డబుల్స్ ఈవెంట్‌లో శ్రీజ ఆకుల, రీత్ టెన్నిసన్, సౌతాఫ్రికాకు చెందిన లాయిలా ఎడ్‌వర్డ్స్‌, దనిష పటేల్‌పై గెలుపొందారు. 11-7,11-7,11-5 తేడాతో శ్రీజ ఆకుల, రీత్ టెన్నిసన్ విజయం సాధించారు. 


 

CM KCR - Akhilesh Meet: సీఎం కేసీఆర్, అఖిలేష్ యాదవ్ సమావేశం

ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ తో  సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం అయ్యారు.  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ కూడా ఇందులో ఉన్నారు.

AP High Court News: బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల రద్దుకు హైకోర్టు నిరాకరణ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను అర్ధాంతరంగా రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత విద్యార్థుల పదో తరగతి పూర్తయ్యే వరకూ స్కూళ్లను కొనసాగించాలని ఆదేశించింది. మాల మహానాడు నేతలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్  నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చిన వారికి కొర్పొరేట్ స్కూళ్లలో చదువు కోసం ప్రభుత్వం ఈ పథకం రూపొందించిన సంగతి తెలిసిందే. ఒకటి, ఐదో తరగతుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ ఇందులో చేర్చనుంది. హైకోర్టు తీర్పుతో 49 వేల మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఊరట లభించనుంది. 

Nellore News: నెల్లూరు కార్పొరేషన్లో ఫైటింగ్ సీన్ - అరేయ్, ఒరేయ్ అంటూ తిట్టుకున్న కార్పొరేటర్లు

నెల్లూరు కార్పొరేషన్లో అందరూ వైసీపీ కార్పొరేటర్లే, ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా లేదు. కానీ అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కార్పొరేటర్ల మధ్య ఒకరికొకరికి మాటలు పొసగడంలేదు. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకులు ఒకరినొకరు కొట్టుకోబోయారు. బూతులు తిట్టుకున్నారు. అరేయ్, ఒరేయ్.. అంతూ చూస్తానంటూ రెచ్చిపోయారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ మధ్య మాటల యుద్ధం నెట్టుకునే వరకు వెళ్లింది. రూప్ వర్గీయులు కర్తం ప్రతాప్ పై దాడి చేసేందుకు దూసుకెళ్లారు. మిగతా కార్పొరేటర్లు, సిబ్బంది సర్దుబాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు సభలో రూప్ కుమార్ క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Visakhapatnam News: మళ్లీ విశాఖలో రింగు వలల వివాదం

  • విశాఖలో మళ్లీ మొదలైన రింగు వల వివాదం 

  • సంప్రదాయ-రింగు వలల మత్స్యకారుల మద్య మొదలైన అలజడి 

  • రెండు వర్గాలుగా విడిపోయిన మత్స్యకారులు 

  • లంగరు వేసిన 6 తెప్పలు వలలు తగలు పెట్టిన సంప్రదాయ మత్స్యకారులు 

  • తెల్లవారుజామున 2 గంటల నుండి జరుగుతున్న వ్వవహారం 

  • జాలరిఎండాడ, పెదజాలరిపేటలో భారీగా మోహరించిన పోలీసులు 

  • పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం

  • వాసవానిపాలెంలో కన్నీరు పెట్టుకుంటున్న రింగు వల మత్స్యకారులు

Background

Weather Latest News:  ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. తూర్పు రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో జూలై 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో సైతం పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.  


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉండగా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం రాయలసీమపై లేదు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో చలి గాలులు వీస్తాయి.


Telangana Weather: తెలంగాణలో ఇలా
‘‘మొదటి వారం 29.7.2022 నుండి 4.8.2022 వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా, తెలంగాణపై రెండవ వారం 5.8.2022 నుండి 11.8.2022 వరకు వర్షపాతం పెరిగే అవకాశం ఉంది.’’ అని ఐఎండీ హైదరాబాద్ అధికారులు ట్వీట్ చేశారు.ఇక హైదరాబాద్ లో వాతావరణం పగలు, ఒకలా, మధ్యాహ్నం, రాత్రి మరోలా ఉంటోంది. ఉదయం పొడి వాతావరణం కొనసాగుతుండగా, సాయంత్రం, రాత్రి వేళల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాడు సాయంత్రం వేళ దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్, షేక్‌పేట్, టోలీచౌకి, రాయదుర్గం, షాపూర్ నగర్, చింతల్, గాంజులరామారం ప్రాంతాల్లో విపరీతమైన కురిసింది. 


నేడు ఇలా..
ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.