Breaking News Live Updates: తిరుపతిలో ఈదురుగాలుల బీభత్సం, రేణిగుంటలో విమాన రాకపోకలకు అంతరాయం   

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 May 2022 09:22 PM
తిరుపతిలో ఈదురుగాలుల బీభత్సం, రేణిగుంటలో విమాన రాకపోకలకు అంతరాయం   

తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇవాళ సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలుల వీస్తున్నాయి. దీంతో నగర వాసులు, యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా వీస్తున్న ఈదురు గాలులు, ఉరుములకు నగర వాసులు ఇండ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. ఈదురు గాలులకు సాయంత్రం నుంచి నగరంలో పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.


విమాన రాకపోకలకు అంతరాయం


తిరుపతిలో వాతావరణ అనుకూలించక విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి సాయంత్రం 7:20 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం  వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మరొక ఇండిగో విమానం విజయవాడ నుంచి తిరుపతికి 8:10 నిమిషాలకు రావాల్సి ఉన్నా  భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు 

Congress Warangal Meeting: ఓరుగల్లులో రైతు డిక్లరేషన్ ప్రటించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

వరంగల్‌లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్‌ మీటింగ్‌లో రైతు డిక్లరేషన్ ప్రటించింది. ఈ డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. 


1. అధికారంలోకి రాగానే రైతులందరికీ రెండు లక్షల రుణ మాఫీ


2. ఎకరానికి 15వేల రూపాయల పెట్టుబడి సాయం 


3. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే మొత్తం కొనుగోలు చేస్తాం. 


4. తెలంగాణలో మూతబడిన చెరకు కర్మాగారాలను తెరిపిస్తాం. చెరకు, పసుపు రైతులను ఆదుకుంటాం. 


5. రైతులపై భారం లేకుండే మెరుగైన పంటల బీమా తీసుకొస్తాం. వీలైనంత త్వరగా నష్టం అంచనా వేస్తాం. 


6. భూమి లేని రైతు కూలీలకు రైతు బీమ వర్తింపు 


7. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తాం.


8. ధరణీ పోర్టల్ రద్దు చేసి సులభతరమైన విధానం తీసుకొస్తాం. 


9. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులపై ఉక్కపాదం మోపేందుకు కఠిన చట్టం తీసుకొస్తాం. 


10. అవినీతి లేకుండా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.


11. రైతుల సమస్యల శాశ్వత పరిరక్షణ కోసం చట్టపరమైన హక్కులతో రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తాం.


12. తెలంగాణ భూములకు అనుగుణంగా కాలానుగుణంగా వ్యవసాయ విధానాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా మారుస్తాం. 


13. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పంట ఏ ధర ఇస్తుందో చెప్పారు. వరి- రూ. 2500  మొక్కజొన్న- రూ. 2200  కందులు- రూ. 6700  పత్తి - రూ. 6500 మిర్చి క్వింట రూ. 15000 పసుపు క్వింటా- రూ. 12000 ఎర్రజొన్న రూ. 3500  

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రత్యేక హెలికాఫ్టర్ లో వరంగల్ కు పయనం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ప్రోటోకాల్ ఇంఛార్జీలు హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీష్ తదితరులు  స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో శంషాబాద్ నుంచి వరంగల్ బయలు దేరారు. రాహుల్ గాంధీ వెంట హెలికాప్టర్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. వరంగల్ లో  సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ కు చేరుకుని , అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ఓపెన్ టాప్ లో ఆర్ట్స్ అండ్ సైన్సు గ్రౌండ్ కు రాహుల్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో  ప్రసంగిస్తారు. 

Bojjala Gopala Krishna Reddy: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. 1949 ఏప్రిల్‌ 15న జన్మించిన బొజ్జల... మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పని చేశారు. చంద్రబాబు హయాంలో అటవీ శాఖ మంత్రిగా సేవలు అందించారు.  

Governor Tamilisai: సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

Governor Tamilisai: సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై  మీడియాలో వచ్చిన  కథనాల ఆధారంగా మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుండి హత్యపై వివరణాత్మక నివేదికను కోరారు గవర్నర్ తమిళి సై.

Andhra Pradesh ప్రభుత్వంపై పోరాటానికి అందరూ ఏకమవుదాం, త్యాగాలకు సైతం సిద్ధం: చంద్రబాబు

రాష్ట్రంలో అత్యాచారాలు నియంత్రించలేని ప్రభుత్వం గద్దె దిగాలని, అత్యాచారాలు సహజమేనని హోం మంత్రి అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అత్యాచారాలు అరికట్టడం మానుకుని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని మంత్రుల తీరును ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం పోరాటం చేసేందుకు అందరూ కలికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. అందుకోసం త్యాగాలకు సైతం సిద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి లో ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradeshలో మహిళలకు రక్షణ లేదు, పాలన చేతకాకపోతే దిగిపోండి: సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju Comments: కడప జిల్లా..  కడపలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు సోము వీర్రాజు, వై.సత్యకుమర్ నిప్పులు చెరిగారు. పాలించేది చేత కాకపోతే దిగిపోండి.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. అత్యాచార బాధితులకు న్యాయం చేయకుండా ప్రతిపక్షాలపై ఆరోపణలు సరికాదు. అత్యాచార ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేయండి. పోలీసులను కట్టడి చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. గుప్పెడు ఎమ్మెల్యేలతో, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని విర్రవీగితే ఎలా.. దేశంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎలాఉంటుందో వైసీపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. 


కేంద్రం హెల్త్ మిషన్ క్రింద ఇచ్చే నిధులను దారి మళ్లించి ఏం చేస్తోంది. ఏపీలో పరిపాలన లేదు, సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. సొంత జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చూసినా చర్యలు లేకపోవడం దారుణమన్నారు. జగన్ రాజభవనం వీడి జనంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కుల పార్టీకి, కుటుంబ పార్టీలకు స్వస్తి చెప్పి బీజేపీని ప్రజలు ఆదరించాలని, స్పష్టమైన అజెండాతోనే ఏపీలో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు సోము వీర్రాజు.

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి

Tirumala Updates: తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ప్రముఖ యాంకర్ ప్రదీప్ మచిరాజు, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Ration Rice Seized: బాపట్ల జిల్లాలో 10 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం, మినీ లారీ సీజ్

Ration Rice Seized: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం తురుమెళ్ళ గ్రామంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పై దాడి చేశారు. మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, మినీ లారీ స్వాధీనం చేసుకున్నారు.

Chandrababu Kuppam Tour: ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్ర బాబు పర్యటన

Chandrababu Kuppam Tour: ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్ర బాబు పర్యటన


చిత్తూరు : టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్ర బాబు పర్యటన

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Rahul Telangana Tour: కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Rahul Telangana Tour: ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పలు విమర్శలు చేశారు. రాహుల్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్లు, ఆరోపణలు చేశారు. నేడు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్న తరుణంలో తెలంగాణ కోసం మీరు ఏం చేశారంటూ నేటి ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలు సంధించగా.. ‘చూసుకొని మురవాలి...చెప్పుకొని ఏడ్వాలి...’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.


తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. కవితను ట్యాగ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు రేవంత్ రెడ్డి.


‘కవితగారూ.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.


ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. ?


మీ నాన్న కేసీఆర్, ప్రధాని మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?


వరి వేస్తే ఉరేనని మీ నాన్న ప్రవచనాలు చెప్పిన ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాలలో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ?


ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? అని పలు ప్రశ్నలు సంధిస్తూ కవితకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

అనకాపల్లి జిల్లాలో ఘోరం, బాలికపై మరో అత్యాచారం

అనకాపల్లి జిల్లాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెళ్లు బహిరంగ విసర్జనకు వెళ్లగా, నిందితుడు ఓ బాలికను లాక్కెళ్లినట్లు సమాచారం. మరో బాలిక ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, వారు వెతికేసరికే ఘోరం జరిగిపోయింది. రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గింది. ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు (మే 6న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. తదుపరి 48 గంటలలో వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాం..
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల గాలులు వీచే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాంధ్రలో ఇలా..
ఈ ప్రాంతంలోనూ మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. 


రాయలసీమలో తేలికపాటి జల్లులు..
రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధిక వర్షపాతం తిరుపతిలో 38.5 మిల్లీమీటర్లుగా నమోదైందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.


నిప్పుల కొలిమిలా తెలంగాణ..
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.