నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు, ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Teja) ఎంట్రీ సినిమా ప్రారంభ వేడుకను రీసెంట్‌గా ఓ రేంజ్‌లో మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా ఆ వేడుక వాయిదా పడింది. అందుకు కారణం బాలయ్య వివరణ ఇచ్చిన ప్రకారం... మోక్షు బాబుకి హై ఫీవర్ రావడమే అని. అందుకే మరో మంచి డేట్ చూసుకుని వేడుక చేసుకోవచ్చని వాయిదా వేసినట్లుగా బాలయ్య చెబుతూ.. అంతా మన మంచికే అని అన్నారు.
ఆ ‘అంతా మన మంచికే’ అన్న పదం అనేక విపరీతార్థాలకు దారి తీసింది. బాలయ్యకు, ఈ సినిమా నిర్మాతతో మోక్షు ఎంట్రీ సినిమా చేయడం ఇష్టం లేదని, అందుకే వాయిదా వేయించారనేలా సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు మొదలయ్యాయి. అంతే కాదు, బాలయ్య ఈ విషయం చెప్పి కూడా దాదాపు 10 రోజులు కావస్తుంది. ఇంకా మోక్షు బాబుకి జ్వరం తగ్గలేదా? అసలు ఈ సినిమా ఉంటుందా? టోటల్‌గా క్యాన్సిల్ చేసేశారా? అనేలా అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ.. తాజాగా మేకర్స్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అధికారిక ప్రకటన అనగానే ఇదేదో సింబా మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించినది అనుకుంటారేమో.. అలాంటిదేమీ కాదు.. జస్ట్.. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పడానికి ఓ ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ప్రకటనలో.. ‘‘ప్రశాంత్ వర్మ మరియు నందమూరి మోక్ష్ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమాపై ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న రూమర్స్‌కు ఇదే మా వివరణ. ఈ సినిమా గురించి ఎటువంటి వార్తలైతే స్ప్రెడ్ అవుతున్నాయో.. అవన్నీ నిరాధారమైన రూమర్స్ మాత్రమే. వాటిలో ఏమాత్రం నిజం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం, అప్డేట్స్ టైమ్ వచ్చినప్పుడు మేమే అధికారికంగా ఎస్ఎల్‌వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తాము. అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేని సమాచారాన్ని షేర్ చేయవద్దని పబ్లిక్ మరియు మీడియా వారికి తెలియజేస్తున్నాము. అర్థం చేసుకుంటారని భావిస్తూ.. మీ మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’’ అని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. సో.. బాలయ్య తనయుడి మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అనేది మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
బాలకృష్ణ కుమార్తె ఎమ్ తేజస్విని నందమూరి సమర్పించనున్న ఈ చిత్రాన్ని లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా మోక్షజ్ఞ తొలి చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి ప్రారంభించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.