Ravichandran Ashwin The Backbone of Indias Bowling: టీమిండియా దశాబ్దాల పాటు క్రికెట్ ను శాసించిందంటే దానికి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్. బిషన్ సింగ్ బేడీ, దిలీప్ జోషీ, శివరామకృష్ణన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజ భారత స్పిన్నర్ల వారసత్వాన్న కొనసాగించే బాధ్యత రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పై పడింది. భారత జట్టు వెన్నుముకగా నిలిచి ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 T20లు ఆడారు. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, T20లో 72 వికెట్లు తీశారు. అశ్విన్ 2010లో శ్రీలంకపై వన్డేల్లో, 2011లో వెస్టిండీస్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. ఆడిలైడ్ లో అశ్విన్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. టెస్టుల్లో 6 సెంచరీలు,14 హాఫ్ సెంచరీలతో 3503 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ గా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి అశ్విన్ జట్టు కోసం వంద శాతం కష్టపడేవాడు.
అశ్విన్ అంకితభావం అలాంటిది
2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా... ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఆ మ్యాచులో అయిదురోజు టీమిండియా గెలవాలంటో 407 పరుగులు చేయాలి. అది చాలా కష్టం. డ్రా చేయాలన్నా టీమిండియాకు తలకు మించిన భారమే. అయితే టీమిండియా అద్భుతంగా పోరాడింది. ఆసీస్ జట్టు విజయానికి అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్న వేళ.. విపరీతమైన వెన్ను నొప్పిలోనూ అశ్విన్ అద్బుత పోరాటంతో భారత జట్టును ఓడిపోకుండా కాపాడాడు. అశ్విన్ విపరీతమైన నొప్పితో పడుకున్నాడని.. ఉదయం లేచి కనీసం నిటారుగా కూడా నిలపడలేకపోయాడని.. అలాంటిది ఆట అంత అద్భుతంగా ఎలా ఆడగలిగాడో తనకు అర్థం కాలేదని ఆశ్విన్ భార్య చెప్పడం.. అశ్విన్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్తుంది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయిన అశ్విన్ అ మ్యాచులో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా చేశాడు. ఇలాంటి ఎన్నో ఇన్నింగ్సులను అశ్విన్ ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి వంద శాతం ప్రదర్శన ఇచ్చాడు. ఎన్నో రికార్డులను పాదాక్రాంతం చేశాడు. తాను ఎందుకు ప్రత్యేకమైన ఆటగాడినో ప్రతీసారి చాటి చెప్పాడు. ఒక మ్యాచులో విఫలమై తనపై తీవ్ర విమర్శలు వచ్చినా... తర్వాతి మ్యాచులో బంతితోనే దానికి సమాధానం చెప్పేవాడు. అందుకే అశ్విన్.. ఓ క్రికెట్ లెజెండ్.
ఈ రికార్డులు చెప్పవా..
అశ్విన్ తన కెరీర్ లో 268 మంది లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేశాడు. లెఫ్టాండర్లు క్రీజులో ఉంటే అశ్విన్ ఇక ఆగడు. బంతిని గింగరాలు తిప్పుతూ.. వికెట్లను గిరాటేస్తూ పెవిలియన్ కు పంపుతాడు. 2011/12లో వెస్టిండీస్‌తో జరిగిన అరంగేట్ర సిరీస్‌లో 22 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ తన కెరీర్‌లో అద్భుతంగా ఆరంభించాడు. 2015 నుంచి 2021 సీజన్ మధ్య, అతను ఆసియాలో 20.88, ఇంగ్లాండ్‌లో 27.00, ఆస్ట్రేలియాలో 27.50, వెస్టిండీస్‌లో 23.17 సగటుతో వికెట్లను తీశాడు. ఆ సమయంలో మరే బౌలర్ ఈ సగటుతో వికెట్లను తీయలేదు. 2016/17 సుదీర్ఘ సీజన్‌లో అశ్విన్ స్వదేశంలో అద్భుత ఫామ్ తో చెలరేగిపోయాడు.
కేవలం నాలుగు సిరీసుల్లో 13 టెస్టు మ్యాచులు ఆడి 82 వికెట్లు సాధించాడు - టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ 13 టెస్టుల్లో 4430 డెలివరీలు వేశాడు. వీటిలో భారత్ 10 టెస్టుల్లో భారత్ గెలిచింది. అశ్విన్ టీమిండియాకు ఎంత కీలకమైన ఆటగాడో చెప్పేందుకు ఇంతకంటే ఎక్కువ గణాంకాలు అవసరం లేదు. అశ్విన్ 537 టెస్ట్ వికెట్లలో 383 స్వదేశంలోనే వచ్చాయి. మురళీధరన్ (493), జేమ్స్ ఆండర్సన్ (438), స్టువర్ట్ బోర్డ్ (398) తర్వాత స్వదేశంలో ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.