Ashwin’s Unique Approach to Bowling":
ప్రపంచ క్రికెట్ (Indtrnational Cricket) చరిత్రలో మరో శకం ముగిసింది. బంతితో అద్భుతాలు చేసే మేధావి.. క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. బౌలింగ్ లో అపర మేధావిగా ఖ్యాతి గడించిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin).. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అభిమానులను షాక్ కు గురిచేశాడు. క్రికెట్ మైదానంలో అశ్విన్ ఒక ఆచార్యుడు. క్రీజులోకి బ్యాటర్ రాగానే అతనికి తగ్గట్లు వ్యూహాలు రచించి... ఆ వ్యూహంలో అతడిని బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి మరీ పెవిలియన్ కు పంపడం అశ్విన్ కు బాల్ తో పెట్టిన విద్య. బంతిని గింగిరాలు తిప్పాలన్నా.. ఫ్లైట్ చేసి బ్యాటర్ ను ఊరించి అవుట్ చేయాలన్నా.. బ్యాటర్ లోపాలను కనిపెట్టి అతడిని పెవిలియన్ కు చేర్చాలన్న అది అశ్విన్ కే సాధ్యం. అందుకే అల్వీదా అశ్విన్. నువ్వు భారత్ క్రికెట్ ప్రపంచానికి అందించిన మరో ఆణిముత్యానివి.. క్రికెట్ పిచ్ పై చెరగని సంతకానివి.
అశ్విన్.. స్పిన్ కింగ్
భారత జట్టు సీనియర్ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు. అద్భుతమైన విజయాల్లో కీలక పాత్ర పోషించి భారత్ క్రికెట్ చరిత్రపై చెరగని సంతకం పెట్టిన అశ్విన్.. అద్భుతమైన కెరీర్‌ను ముగించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకడిగా అశ్విన్ ఖ్యాతి గడించాడు. అసాధారణమైన స్పిన్ బౌలింగ్, తెలివైన బంతులు.. అచంచలమైన అంకితభావం.. అశ్విన్ ను గొప్ప ఆటగాడిగా నిలబెట్టాయి.
ఆ ప్రయాణం అనితర సాధ్యం
1986 సెప్టెంబరు 17న చెన్నైలో జన్మించిన అశ్విన్ బ్యాటింగ్‌పై మక్కువతో క్రికెట్ ప్రయాణం మొదలు పెట్టాడు. తండ్రి, రవిచంద్రన్ క్లబ్-స్థాయి ఫాస్ట్ బౌలర్. తండ్రి ప్రోత్సాహంతో అశ్విన్ ఓపెనింగ్ బ్యాటర్ గా తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. భారత అండర్-17 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్, సెయింట్ బేడేస్ స్కూల్‌లో చదివిన అశ్విన్.. స్కూల్ క్రికెట్ లో తిరుగులేని ఆటతో అద్భుతాలు సృష్టించాడు. చెన్నైలోని SSN కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో BTech చేశాడు. కోచ్ సలహా మేరకు బ్యాటర్ నుంచి ఆఫ్ స్పిన్‌కు మారాడు. ఈ నిర్ణయం అశ్విన్ కెరీర్ తో పాటు భారత స్పిన్ చరిత్రను మార్చేసింది. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసేలా చేసింది. మాజీ స్పిన్నర్ సునీల్ సుబ్రమణ్యం మార్గదర్శకత్వంలో.. మాజీ క్రికెటర్ W V రామన్ శిక్షణలో అశ్విన్ తిరుగులేని బౌలర్ గా ఎదిగి.. అద్భుతాలు సృష్టించాడు.
Also Read: స్మృతి మంధాన ప్రపంచ రికార్డు..
14 ఏళ్ల క్రికెట్ ప్రస్థానం
2010లో అతని అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అశ్విన్... జింబాబ్వేలో జరిగిన ట్రై-సిరీస్ సందర్భంగా మొదటగా భారత జెర్సీని ధరించాడు, జూన్ 5, 2010న శ్రీలంకతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 32 బంతుల్లో 38 పరుగులు చేయడమే కాక... రెండు కీలక వికెట్లు తీశాడు. అప్పుడు ప్రారంభమైన అశ్విన్ ప్రయాణం.. ఎన్నో విజయాల్లో పాత్ర పోషించేలా చేసింది.