Ravichandran Ashwin Announces Retirement: టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్పిన్ మాంత్రికుడు కనిపించడు. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటి వరకు అశ్విన్‌కు బలమైన రికార్డు ఉంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించిన చరిత్ర అతనిడి. ఎన్నో ఓడిపోయిన మ్యాచ్‌లను గెలిపించాడు, డ్రాగా ముగించాడు. టెస్టుతో పాటు వన్డే క్రికెట్‌లోనూ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్‌కు మూడు ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఒక్క బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేశాడు. అశ్విన్ టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. 3503 పరుగులు కూడా చేశాడు. అలాంటి రికార్డు ఉన్న క్రికెటర్ నేడు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఈ టెస్టు మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. అశ్విన్‌తోపాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు అంటూ చెప్పారు.
భారత్ తరఫున 106 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 124 పరుగులు అతని అత్యుత్తమ టెస్టు స్కోరు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నోసార్లు మంచి ప్రదర్శన ఇచ్చి భారత్‌ను గట్టెక్కించాడు. 537 వికెట్లు తీశాడు. 59 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కు టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన.
అశ్విన్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ ఏమన్నాడంటే...
సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ఇవ్వాలని అశ్విన్ నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేమందరం గౌరవిస్తాం. అన్ని ఆలోచించుకున్నాక అశ్విన్ నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ సిరీస్ ప్రారంభంలోనే నాతో చెప్పాడు. పెర్త్ టెస్ట్‌కే అశ్విన్ విషయంలో నాకు క్లారిటీ ఉంది. అడిలైడ్ టెస్ట్ వరకు ఉండమని నేనే కన్విన్స్ చేశాను. గౌతమ్ గంభీర్‌తో కూడా అదే డిస్కస్ చేశాను. నా అవసరం లేకపోతే రిటైర్మెంట్ ఇచ్చేస్తానని మళ్లీ చెప్పాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో తన డెసిషన్ తను తీసుకున్నాడు. నాలుగో టెస్ట్‌కి చాలా గ్యాప్ ఉంది. సో అశ్విన్‌ని రీప్లేస్ చేయడానికి మేం ఆలోచిస్తాం. అని టీమిండియా కెప్టెన్ రోహిత్ చెప్పారు.
ఇన్ని రోజులు టీమిండియాకు మీరు అందించిన సేవలకు కృతజ్ఞత అంటూ బీసీసీఐ ఓ ఎమోషనల్ పోస్టుపెట్టింది. ఓ మంచి ఆల్‌రౌండర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ఎక్స్‌లో పోస్టు చేసింది.