IND vs AUS 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యం లభించింది. గబ్బా టెస్టు ఐదో రోజు ఆకాశ్‌దీప్ వికెట్ పతనంతో భారత్ పదో వికెట్ కోల్పోయింది. నాలుగో రోజు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్ కలిసి టీమ్‌ఇండియాను ఫాలోఆన్ నుంచి కాపాడారు. ఐదో రోజు భారత జట్టు మైదానంలో కేవలం 4 ఓవర్లు మాత్రమే నిలబడింది. ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు పడగొడితే మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు.
భారత్ తరఫున యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ మాత్రం గోడలా నిలబడిపోయాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
గబ్బాలో నాలుగో రోజు వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించింది. మొత్తానికి రాహుల్ 84 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్న రాహుల్‌ను స్టీవ్ స్మిత్ మెరుపు వేగంతో పట్టిన క్యాచ్ అవుట్ చేసింది.
రాహుల్-జడేజాల ముఖ్యమైన భాగస్వామ్యం
కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వరుసగా 10, 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత KL రాహుల్‌కు రవీంద్ర జడేజా అండగా నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది చాలా వరకు భారత జట్టును విన్నింగ్ రేస్‌లో నిలబెట్టింది. రాహుల్ 84 పరుగులు చేసి ఔట్ కాగా, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రవీంద్ర జడేజా 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 19 పరుగుల వద్ద నితీష్ ఔట్ కాగా, జడేజా 77 పరుగులు చేశాడు.
పరువు కాపాడిన బుమ్రా-ఆకాశ్‌దీప్
ఒక దశలో 213 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఫాలోఆన్‌ను తప్పించుకోవడానికి ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో 10, 11 వ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు అయినప్పటికీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్‌దీప్ బాధ్యతాయుతంగా ఆడారు. బుమ్రా, ఆకాష్‌దీప్ 47 పరుగులు పార్టనర్‌షిప్ నెలకొల్పారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్‌ను 246కు పరుగులు పెట్టించి ఫాలో-ఆన్ మార్క్‌ను దాటించారు. ఈ క్రమంలో ఆకాశ్‌దీప్ 31, బుమ్రా 10 పరుగులు చేశారు. ఐదో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఆకాష్‌దీప్ అవుట్‌తో ఇన్నింగ్స్‌ను భారత్ ముగించింది.